లెస్బియన్ జంట కేసులో మంగళవారం కేరళ హైకోర్ట్ కీలక తీర్పు చెప్పింది. ఇద్దరు అమ్మాయిలు కలిసి ఉండేందుకు అనుకూలంగా కీలక జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ ఇద్దరమ్మాయిల ప్రేమకు వారి తల్లిదండ్రులే అడ్డంకిగా నిలిచారు. చివరకు కేరళ హైకోర్ట్ లో హేబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో మళ్లీ వీరిద్దరు కలిశారు.
కేరళకు చెందిన ఆదిలా నస్రిన్, పాతిమా నూరాలు ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ విషయం వారి ఇళ్లలో తెలియడంతో వారిద్దరిని తల్లిదండ్రులు బలవంతంగా విడదీశారు. పాతిమా నూరాను ఆమె తల్లిదండ్రులు, కుటుంబం బలవంతంగా కన్వర్షన్ థెరపీకి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో ఆదిలా నస్రిన్ తన నెచ్చెలి కోసం హైకోర్ట్ తలుపు తట్టింది. హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది. దీంతో పాతిమా నూరాను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఇద్దరూ కలిసి జీవించాలనే కోరికను వ్యక్తం చేయడంతో జస్టిస్ కే.వినోద్ చంద్రన్, సి. జయచంద్రన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసన ఈ ఇద్దరు యువతులకు అనుకూలంగా తీర్పు చెప్పింది.
మేము లెస్బియన్ జంటగా ఉన్నామని.. చదువుకునే రోజుల నుంచే మేమిద్దరం జంటగా ఉన్నట్లు ఆదిలా నస్రిన్ తెలిపింది. అయితే మా సంబంధం గురించి తల్లిదండ్రులకు తెలిసిందని.. అయినా మేము మా సంబంధాన్ని కొనసాగించామని ఆమె తెలిపింది. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఊరు వదిలినప్పుడు పరిస్థితులంతా తారుమారయ్యాని.. మా ఇద్దరిని మా తల్లిదండ్రులు మానసికంగా హింసించారని ఆదిలా నస్రిన్ వెల్లడించారు.