Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది టూరిస్టులు మరణించారు. పాకిస్తాన్‌కి చెందిన లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రవాద సంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ దాడి చేసింది. ఈ దాడి వెనక పాకిస్తాన్ ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోంది. ఐఎస్ఐ, పాక్ ఆర్మీ, ఉగ్రవాదులు కలిసి ప్లాన్ చేసినట్లు మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీల చేతిలో సాక్ష్యాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, పాక్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా (LeT), జైషే-ఏ-మొహమ్మద్ (JeM) సంబంధాల గురించి బహిర్గతమవుతున్నాయి.
భారత భూభాగంలోకి చొరబాటు ప్రయత్నాల్లో పాల్గొన్న లాంచ్ కమాండర్ల నుంచి ఉగ్రవాద సంస్థల నిర్మాణం, పాకిస్తాన్ ప్రమేయం, వారి ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన వివరాలు ఇంటెలిజెన్స్ వద్ద ఉన్నాయి.
లష్కరే నెట్వర్క్: లష్కరే తోయిబా చీఫ్‌గా భారత మోస్ట్ వాంటెంట్ ఉగ్రవాది, ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ మొదటిస్థానంలో ఉన్నారు. అతడి కుమారుడు తల్హా సయీద్ ఇప్పుడు ఎక్కువగా ఉగ్రసంస్థ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
ముంబై దాడులతో సహా అనేక ఉగ్రవాద ఘటన వెనక ప్రధాన సూత్రధారిగా ఉన్న మరో లష్కరే ఉగ్రవాది జాకీవుర్ రెహ్మాన్ లఖ్వీ పేరు కూడా ఇంటెలిజెన్స్ ప్రతాల్లో ఉంది. ముంబై దాడుల్లో ప్రమేయం కారణంగా ఇతడికి పాక్ 2021లో దోషిగా నిర్ధారించి, 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇతను ఉగ్రవాద శిక్షణా శిబిరాలు, సైనిక ప్రణాళిక, ఆన్ గ్రౌండ్ ఆపరేషన్స్ పర్యవేక్షిస్తుంటాడు.
లష్కరే లో ఇతర కీలక వ్యక్తులు:
సాజిద్ మీర్ అలియాస్ సైఫుల్లా సాజిద్ జట్: ముంబై ఉగ్రవాద దాడులకు వ్యూహకర్త, ప్రస్తుతం ఇతను అంతర్జాతీయ రిక్రూట్మెంట్‌ని పర్యవేక్షిస్తు్న్నాడు.
మహమ్మద్ యాహ్యా ముజాహిద్: లష్కరే మీడియా చీఫ్. ప్రచారం, ప్రాపగండా సందేశాలకు బాధ్యత వహిస్తున్నాడు.
హాజీ ముహమ్మద్ అష్రఫ్: టెర్రర్ ఆర్గనైజేషన్ ప్రధాన ఫైనాన్షియర్. ఇతను లష్కరే తోయిబాకు అనుబంధంగా ఉన్న, జామత్ – ఉద్-దావా (JuD) ద్వారా నిధుల సేకరణను పర్యవేక్షిస్తున్నాడు.
ఆరిఫ్ కస్మానీ: అల్ ఖైదాతో పాటు ఇతర ఉగ్రవాద సంస్థలకు మధ్య అనుసంధానకర్త.
జాఫర్ ఇక్బాల్: ఐడలాజికల్‌గా ప్రేరేపించడం, శిక్షణ కార్యకలాపాల్లో పాల్గొంటాడు.
లష్కరే తోయిబాకు చెందిన మధ్యస్థాయి కమాండర్లలో నియంత్రణ రేఖ (LoC) వెంబడి చురుకుగా చొరబాటుదారులు, హ్యాండర్లు ఉన్నారు. పాకిస్తాన్‌లో శిక్షణ పొందిన ఆదిల్ థోకర్ అనే వ్యక్తి ఇటీవల పహల్గామ్ అటాక్‌లో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు.
ఉగ్రవాద సంస్థ, రాజకీయ నిర్మాణం:
హఫీజ్ సయీద్ లష్కరే తోయిబా కార్యకలాపాలను కప్పిపుచ్చుకునేందుకు ‘‘జమాత్ ఉద్ దావా’’ అనేది సామాజిక సేవ సంస్థగా పనిచేస్తోంది. పాఠశాలలు, ఆస్పత్రులు, సంక్షేమ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఫలాహ్-ఎ-ఇన్సానియత్ ఫౌండేషన్ (FIF), అల్ మదీనా మరియు ఐసర్ ఫౌండేషన్ వంటివి ప్రపంచ ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి ముసుగుగా ఉపయోగపడుతున్నాయి. లష్కరే తోయిబా రాజకీయ సంస్థ మిల్లీ ముస్లిం లీగ్ (MML)ని అమెరికా నిషేధించింది. అయినప్పటికీ ఇది పాక్ రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది.
లష్కరే తోయిబాకు ఆర్థిక వెన్నెముకగా జమాత్ ఇ ఇస్లామి హవాలా నెట్వర్క్ పనిచేస్తోంది. ఇది భారతదేశంతో పాటు దక్షిణాసియాలో రహస్య మార్గాల ద్వారా నిధుల్ని ట్రాన్స్‌ఫర్ చేస్తోంది. ఇదే కాకుండా,ఉగ్రవాదులకు లాజిస్టిక్, ఆయుధాల సేకరణ, స్లీపర్ సెల్స్‌కి డబ్బులు ఇచ్చే ఆర్థిక కార్యకలాపాలను నిఘా పత్రాలు గుర్తించాయి. లష్కరే తోయిబా లాగే జైష్ ఇ మహ్మద్ కూడా ఇలాంటి నెట్వర్క్ ఉంది.