Kumaraswamy met with KCR: జేడీయూ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, సీఎం కేసీఆర్ తో ప్రగతి భవన్ లో భేటీ కానున్నారు. వీరిద్దరి మధ్య కీలక చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. జాతీయ రాజకీయాలపై ఇరు నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. మొదటగా ఇద్దరు నేతలు ప్రగతి భవన్ లో లంచ్ చేయనున్నారు. ఆ తరువాత సాయంత్ర 5 గంటల వరకు ఇరు నేతల మధ్య చర్చలు జరగనున్నాయి. కేసీఆర్ కొత్తగా జాతీయ పార్టీ పెడుతారనే చర్చ నేపథ్యంలో కుమారస్వామితో కీలక భేటీ జరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో సీఎం కేసీఆర్, మాజీ ప్రధాని దేవెగౌడతో బెంగళూర్ లో సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే జాతీయ రాజకీయాల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో కేసీఆర్ దేశవ్యాప్తంగా ప్రాంతీయపార్టీలు, నేతలను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో దేవెగౌడతో జరిగిన చర్చలకు కొనసాగింపుగానే తాజాగా కుమారస్వామి, సీఎం కేసీఆర్ తో భేటీ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్, జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపేతర ఫ్రంటులను ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష నాయకులను కలుస్తున్నారు.
Read Also: Danam Nagender: సీఎం కేసీఆర్ పై అనుచిత వాఖ్యలు చేస్తే నందుబిలాల్ నిరసన చేయడం తప్పా?
గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్దవ్ ఠాక్రే ఉన్న సమయంలో ఆయనతో ముంబైలో భేటీ అయ్యారు. ఇటీవల కాలంలో వరసగా ఢిల్లి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జేడీయూ నేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ నేత, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ తో పాట్నాలో సమావేశం అయ్యారు. ఆ సమయంలో కూడా వీరి జాతీయ స్థాయిలో బీజేపీని ఎలా ఎదుర్కోవాలనే విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. బీహార్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తో కూడా కేసీఆర్ భేటీ అయ్యారు.
అయితే మిగతా ఎన్డీయేతర, ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ తో సఖ్యతగా ఉంటున్నాయి. అయితే బీజేపేతర, కాంగ్రెసేతర ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్న సీఎం కేసీఆర్ తో కుమార స్వామి చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా.. ఈ సమావేశం అనంతరం ఇరు నేతలు మీడియాలో మాట్లాడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా జాతీయ స్థాయిలో విపక్షాలను ఏకం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ఢిల్లీలో నాలుగు రోజులు పర్యటించారు. తాజాగా కేసీఆర్ తో జేడీయూ అధినేత కుమారస్వామితో భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఇరు నేతలు ఏం మాట్లాడుతారనే దానిపైన ప్రజల్లో ఆసక్తి నెలకొంది.