Kudankulam Nuclear Plant: కుడంకుళం అణు కేంద్రంలో డేటా లీక్?.. డార్క్ వెబ్‌లో బ్లూప్రింట్లు

  • కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం డేటా లీక్..
  • డార్క్ వెబ్‌లో పత్రాలను లీక్ చేసిన హ్యాకర్లు..
  • ఘటనపై దర్యాప్తు చేపట్టిన ప్రభుత్వం..
Kudankulam Nuclear Plant

Kudankulam Nuclear Plant

Kudankulam Nuclear Plant: భారతదేశంలో అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రమైన తమిళనాడులోని కుడంకుళం ప్లాంట్ బ్లూఫ్రింట్స్ డార్క్ వెబ్‌లో లీక్ అయినట్లు తెలుస్తోంది. రాన్సమ్‌వేర్ గ్రూప్ ‘ వరల్డ్ లీక్స్’ ఈ ఫైళ్లను డార్క్ వెబ్‌లో పోస్ట్ చేసినట్లు రాయిటర్స్ నివేదించింది. ఈ ఫైళ్లలో అణు విద్యుత్ కేంద్రానికి సంబంధించిన కొన్ని భాగాల బ్లూ ఫ్రింట్లతో పాటు సరఫరాదారుల వివరాలు ఉన్నాయని, ఈ సమాచారం అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ నుంచి వచ్చిందని హ్యాకర్లు పేర్కొన్నారు.

భారత్‌లో 7 అణు విద్యుత్ కేంద్రాల్లో కుడంకుళం అతిపెద్దది. ఫ్లాంట్ కాంట్రాక్టర్లలో ఒకటైన అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్, థర్డ్-పార్టీ ఇండియన్ డేటా సెంటర్ సర్వీస్ ప్రొవైడర్ యోటా హోస్ట్ చేసిన సర్వర్‌లో తమ డేటా పాక్షిక లీక్‌కు గురైనట్లు, ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసినట్లు రాయిటర్స్ పేర్కొంది. అయితే, ఏ డేటా లీక్ అయిందనే వివరాలను వెల్లడించలేదు. వరల్డ్ లీక్స్ వెబ్‌సైట్‌లోని మొత్తం 858,000 రిలయన్స్ ఫైళ్ళలో, 19,000 ఫైళ్ళు అత్యంత సున్నితమైనవిగా కనిపించాయి. అయితే, ఈ లీక్ అయిన పత్రాల్లో అణు రియాక్టర్ ప్రధాన వ్యవస్థలకు సంబంధించినవి కావని రాయిటర్స్ పేర్కొంది. లీక్ అయిన వాటిలో యూనిట్ 3, 4 లో ఉపయోగించిన వెంటిలేషన్, కూలింగ్ సిస్టమ్స్‌కు సంబంధించిన బ్లూప్రింట్లు ఉన్నట్లు సమాచారం. ఈ లీక్‌పై ప్రభుత్వం విచారణ చేపట్టినట్లు సమాచారం.