Krishna Janmabhoomi Case: ఉత్తర్ ప్రదేశ్ మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. మొగల్ చక్రవర్తి ఔరంగబేబు ఆలయంలోని కొంత భాగాన్ని కూల్చి మసీదును నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ వివాదంపై హిందూసేన తరుపున విష్ణుగుప్త కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మథుర కోర్టు విచారణ జరుపుతోంది. తాజాగా శుక్రవారం ఈ వివాదంపై అడిషనల్ సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ 3 కోర్టు విచారణ జరిపింది. తరుపరి విచారణను జనవరి 25కు వాయిదా వేసింది.
READ ALSO: BJP Leader Laxman : 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మిషన్ 405తో ముందుకు వెళ్లాలి
గతేడాది డిసెంబర్ లో మథుర కోర్టు షాహీ ఈద్గా మసీదు సర్వేకు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాలు పాటించాలని ఇటు హిందూసేనకు, అటు మసీదు కమిటీని ఆదేశించింది. అయితే దీనిపై ముస్లిం సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో సర్వేపై కోర్టు స్టే విధించింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు శ్రీకృష్ణుడి జన్మస్థలమైన 13.37 ఎకరాల భూమిలో ఆలయాన్ని కూల్చివేసి ఈద్గాను నిర్మించాడని డిసెంబర్ 8న హిందూసేన జాతీయ అధ్యక్షుడు విష్ణుగుప్తా, ఉపాధ్యక్షుడు సూర్జిత్ సింగ్ యాదవ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 1968లో శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ వర్సెస్ షాహీ మసీదు ఈద్గా మధ్య జరిగిన ఒప్పందాన్ని కూడా పిటిషన్ సవాలు చేసింది.
గతంలో జ్ఞానవాపి మసీదు వివాదంలో వారణాసి కోర్టు కూడా ఇదే విధంగా సర్వేకు ఆదేశాలు ఇచ్చింది. వీడియో సర్వేలో మసీదులోని వాజూఖానాలోని సరస్సులో శివలింగం లాంటి విగ్రహం లభించింది. దీంతో పాటు గోడలపై కొన్ని దేవతామూర్తుల విగ్రహాలు కూడా కనిపించాయని వీడియో సర్వేలో తేలింది. ఈ కేసు ప్రస్తుతం వారణాసి జిల్లా కోర్టులో ఉంది. దీని మాదిరిగానే మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదం నడుస్తోంది.