దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచార కేసులో బాధితురాలి తరపు న్యాయవాది బృందా గ్రోవర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బాధితురాలి తరపున వాదిస్తున్న కేసుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. సుప్రీంకోర్టు, కోల్‌కతా, సీల్దా ట్రయల్ కోర్టులో వాదనల నుంచి నిష్క్రమిస్తున్నట్లు పేర్కొన్నారు. లీగల్ టీమ్-బాధితురాలి కుటుంబానికి మధ్య నెలకొన్న అభిప్రాయ భేదాల కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఆగస్టు 9, 2023న కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలు అత్యంత ఘోరంగా హత్యాచారానికి గురైంది. సివిల్ వాలంటీర్ సంజయ్ రాయ్‌నే ఈ ఘాతుకానికి పాల్పడనట్లు పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటన దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. పెద్ద ఎత్తున వైద్యులు, ప్రజలు, మహిళా సంఘాలు నిరసనలు వ్యక్తం చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక జూడాలు విధులు బహిష్కరించారు. దీంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రంగంలోకి దిగి.. డిమాండ్లు పరిష్కరించడంతో తిరిగి విధుల్లో చేరారు. అయితే బాధితురాలి తరపున సీనియర్ న్యాయవాది వృందా గ్రోవార్ న్యాయస్థానాల్లో వాదనలు వినిపిస్తున్నారు. సెప్టెంబర్ నెల నుంచి బాధితురాలి కుటుంబ పక్షాన వాదనలు వినిపించారు. అయితే బాధితురాలి కుటుంబంతో విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో తాజాగా న్యాయవాది కీలక ప్రకటన చేశారు. కేసుల వాదనల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉండగా విత్‌డ్రా కావడంతో ఈ అంశం మరో సంచలనంగా మారింది.