Kirana Hills: భారత్ నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’లో ఇప్పుడు ఓ విషయం సంచలనంగా మారింది. పాకిస్తాన్‌లోని సర్గోదా సమీపంలో ఉన్న ‘‘కిరాణా కొండలు’’ సంచలనంగా మారాయి. సోమవారం త్రివిధ దళాల అధికారులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూడా కిరాణా కొండల ప్రస్తావన వచ్చింది. భారత్ పాక్ కిరాణా కొండలపై దాడి చేసిందా..? అని ప్రశ్నించిన నేపథ్యంలో, అసలేంటి ఈ కిరాణా కొండలు, అంత ప్రాముఖ్యత ఏంటనే అనుమానాలను రేకెత్తించింది.
సోషల్ మీడియాలో ‘‘కిరాణా హిల్స్’’ ట్రెండింగ్:
పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సు సర్గోదా జిల్లాలోని కిరాణా కొండలపై భారత్ దాడి చేసిందని సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. పాక్ ఈ కొండల్లోనే అణు వార్‌హెడ్లను నిల్వ చేస్తుందనే ప్రచారం ఉంది. ఈ కొండల చుట్టూ పాక్ మిలిటరీ అత్యంత భారీ భద్రతను ఏర్పాటు చేసింది. ఈ కొండల్లోని సొరంగాల్లో పాక్ తన అణ్వాయుధాలను దాచి ఉంచుతుందని తెలుస్తోంది.
ఈ కొండల గురించి సోమవారం ఆర్మీ అధికారుల ప్రెస్‌మీట్‌లో కిరాణా హిల్స్ గురించి ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ‘‘ కిరాణా కొండల్లో కొన్ని అణు ఫెసిలిటీలు ఉున్నట్లు మాకు చెప్పినందుకు ధన్యవాదాలు, దాని గురించి మాకు తెలియదు. మేము కిరాణా హిల్స్‌పై దాడి చేయలేదు.’’ అని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆపరేషనల్ డైరెక్టర్ అయిన ఎయిర్ మార్షల్ ఎకే భారతి చెప్పారు.
శనివారం తెల్లవారుజామున, భారత్ పాకిస్తాన్ లోని రఫీకి, మురిద్, నూర్ ఖాన్, రహీమ్ యార్ ఖాన్, సుక్కూర్, చునియన్, పస్రూర్, సియాల్‌కోట్‌లలోని కీలకమైన వైమానిక స్థావరాలతో సహా 11 సైనిక స్థావరాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేసింది. పాకిస్తాన్ మిలిటరీ హెడ్ క్వార్టర్‌గా ఉన్న రావల్పిండి లోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌పై దాడి చేయడం సంచలనంగా మారింది. నూర్ ఖాన్ పాకిస్తాన్ అణ్వాయుధ సామగ్రిని పర్యవేక్షించే సంస్థ అయిన వ్యూహాత్మక ప్రణాళికల విభాగం యొక్క ప్రధాన కార్యాలయానికి దగ్గరగా ఉంది. దీంతో పాక్ న్యూక్లియర్ ప్రోగ్రాం అథారిటీని దెబ్బతీస్తామని భారత్ పరోక్ష హెచ్చరికలు పంపింది.
కిరాణా హిల్స్ పాకిస్తాన్‌కి ఎందుకు కీలకం:
మీ అణ్వాయుధాలను దెబ్బకొట్టగలే సామర్థ్యం తమకు ఉందని భారత్ నిరూపించింది. పదే పదే పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయంటూ భారత్‌ని భయపెట్టడం అలవాటుగా మారింది. అయితే, ఆపరేషన్ సిందూర్ తర్వాత, పాక్‌కి గర్వభంగం అయింది. మీ న్యూ్క్లియర్ స్థావరాలను కూడా కొట్టగలిగే సామర్థ్యం తమకు ఉందని పాకిస్తాన్‌కి అర్థమయ్యేలా చెప్పినట్లు తెలుస్తోంది.
కిరాణా హిల్స్ ఒక వ్యూహాత్మక ప్రాంతం. ఇది సర్గోద వైమానిక స్థావరానికి 20 కి.మీ దూరంలో, కుసాబ్ అణు కర్మాగారానికి 75 కి.మీ దూరంలో ఉంది. రాజధాని ఇస్లామాబాద్‌కి 200 కి.మీ దూరంలో ఉంది. కుషాబ్ అణు కర్మాగారంలో పాకిస్తాన్ ‘‘వెపన్ గ్రేడ్-ప్లూటోనియం’’ ఉత్పత్తికి సంబంధించిన నాలుగు భారీ రియాక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో కిరాణా హిల్స్‌కి వ్యూహాత్మక ప్రాధాన్యత ఏర్పడింది. దాదాపుగా 68 చ.కి.మీ విస్తీర్ణంలో 39 కి.మీ చుట్టుకొలతతో ఉండే ఈ హిల్స్ చుట్టూ పాకిస్తాన్ పలు అంచెల భద్రతను ఏర్పాటు చేసింది. దీంట్లో మొత్తం 10 సొరంగాలు ఉన్నట్లు సమాచారం. ఈ సొరంగాలు అధిక ప్రభావ పేలుళ్లను తట్టుకునేలా రీఎన్‌ఫోర్సుడ్ సిమెంట్ కాంక్రీట్(RCC)ని ఉపయోగించి నిర్మించారు. నూర్ ఖాన్, సర్గోదా వైమానిక స్థావరాలపై దాడులు చేయడం బట్టి పాకిస్తాన్ గురించి తమకు అన్నీ తెలుసనే మెసేజ్‌ని భారత్ ఇచ్చినట్లైంది. అయితే, దీని గురించి ఎయిర్ మార్షల్ ఏకే భారతి నవ్వుతూ చెప్పడాన్ని చూస్తే ఏదో జరిగి ఉండొచ్చని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.