Mallikarjun Kharge: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్‌లను ప్రలోభపెట్టేందుకు మోడీ ప్రయత్నిస్తున్నాడంటూ మండిపడ్డారు. దేశంలో నరేంద్రమోడీ మూడోసారి అధికారంలోకి రావడం కష్టమని ఖర్గే శనివారం అన్నారు. ఆర్జేడీకి చెందిన మనోజ్ కుమార్ ఝాతో కలిసి నిన్న బీహార్‌లో ఆయన మాట్లాడారు. ప్రధాని ప్రసంగాల్లో మునుపటి వాడి కనిపించడం లేదని చెప్పారు. మోడీ తెలంగాణ ప్రచారంలో ఉన్న సమయంలో తాను ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నానని, ప్రధాని ప్రసంగాల్లో అభిమానం, గర్వం కనిపించడం లేదని చెప్పారు.
Read Also: PM Modi: మాతృదినోత్సవం సందర్భంగా మోడీకి గిఫ్ట్.. థ్యాంక్స్ చెప్పిన ప్రధాని
లోక్‌సభ ఎన్నికల్లో గెలవడం కష్టం కాబట్టి గత 10 ఏళ్లుగా బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం సాధించిన విజయాల గురించి మాట్లాడకుండా హిందూ-ముస్లిం మధ్య విభేదాలను సృష్టించేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని ఖర్గే ఆరోపించారు. మూడు దశల ఎన్నికల తర్వాత, మోడీ అధికారంలోకి రావడం కష్టమని చెప్పారు. ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్‌లను ప్రధాని ప్రలోభపెడుతున్నారని నిందించారు. కాంగ్రెస్‌తో కలిసి చనిపోవడం కంటే, ఠాక్రే, పవార్‌లు మారడం మంచిదని బీహార్ ర్యాలీలో ప్రధాని అన్నారు. ప్రధాని స్థాయి వ్యక్తి ఇలాంటి భాష మాట్లాడుతారా..? అని ఖర్గే ప్రశ్నించారు. బీజేపీని వ్యతిరేకించే అన్ని చిన్న పార్టీలు కాంగ్రెస్‌కి చేరువ అవుతాయని, కొన్ని విలీనం కావచ్చని శరద్ పవార్ అంచనా వేసిన నేపథ్యంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.
