Gurpatwant Singh Pannun: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియా మధ్య సంబంధాలను దెబ్బతీసింది. ఎప్పుడూ లేనంతగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దిగువస్థాయికి చేరాయి. అయితే ఒక్క నిజ్జరే కాదు చాలా మంది ఖలిస్తానీ వేర్పాటువాదులు, ఉగ్రవాదులు కెనడాలో తలదాచుకుంటూ భారతదేశంపై విద్వేషాన్ని చిమ్ముతున్నారు. సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) చీఫ్, ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ ఏకంగా భారత దేశాన్ని విడగొట్టాలనే కుట్రకు పాల్పడినట్లు మన నిఘా ఏజెన్సీలు చెబుతున్నాయి.
గతంలో ఈ ఉగ్రవాదిని అప్పగించాలని, రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఇంటర్ పోల్ ని కోరింది భారత్. అయితే రెండు సందర్భాల్లో తిరస్కరించింది. కెనడాల, యూఎస్, యూకేల్లో తిరుగుతూ గురుపత్వంత్ సింగ్ పన్నూ ఖలిస్తాన్ ఎజెండాను నూరిపోస్తున్నారు. అంతే కాకుండా పాక్ గూఢాచార సంస్థ ఐఎస్ఐతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నారు. కె2 ఎజెండాను ఖలిస్తాన్ ఉగ్రవాదులు-ఐఎస్ఐ ఏజెంట్లు ముందుకు తీసుకువస్తున్నారు. కె2 అంటే ఖలిస్తాన్, కాశ్మీర్ అని అర్థం.
ఇదిలా ఉంటే ఇతను కాశ్మీర్ ప్రజల కోసం ప్రత్యేకంగా ఓ ముస్లిం దేశాలను ఏర్పాటు చేయాలని , భారత్ నుంచి జమ్మూ కాశ్మీర్ ను వేరు చేయాలని కలలు కంటున్నాడు. ఓ ఆడియో సందేశంలో భారత సమగ్రత, ఐక్యతను పన్నూ ఛాలెంజ్ చేస్తున్నాడు. పంజాబ్ తో పాటు దేశ వ్యాప్తగా ఉగ్రవాద చర్యలను ప్రోత్సహిస్తున్నాడని చెబుతూ.. 2022లో భారత్ ఇతడిని ఉగ్రవాదిగా గుర్తించింది. అమాయక యువతలో విష బీజాలు నింపుతూ ఖలిస్తాన్ ప్రత్యేక దేశం కోసం ప్రేరేపిస్తున్నాడు.
Read Also: Pakistan: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో అమెరికా రాయబారి పర్యటన.. చెలరేగిన వివాదం..
గురుపత్వంత్ సింగ్ పన్నూ ఎవరు..?
గతేడాది హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ గోడలపై ఖలిస్తాన్ అనుకూల గ్రాఫిటీ, బ్యానర్లు వెలిసిన కేసులో ప్రధాన నిందితుడు. పన్నూ పూర్వీకులు దేశ విభజన సమయంలో 1947లో భారత దేశానికి వలస వచ్చారు. పంజాబ్ లోని ఖాన్ కోట్ ప్రాంతంలో నివాసం ఏర్పాటే చేసుకున్నారు. అతని తల్లిదండ్రులు మరణించారు. సోదరుడు మగ్వంత్ సింగ్ విదేశాల్లో ఉంటున్నాడు.
ముస్లింల మద్దతు కోసం అతను ‘డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఉర్దుస్తాన్’ పేరు పెట్టాలని అనుకున్నాడు. భారత్ నుంచి జమ్మూ కాశ్మీర్ ను వేరు చేసేలా ప్రజలను రెచ్చగొట్టాడు. పన్నూపై ప్రస్తుతం మొత్తం 16 కేసులు ఉన్నాయి. పంజాబ్ తో పాటు ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అతని ఆస్తులను స్వాధీనం చేసుకుంది. 2021లో స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎర్రకోటపై ఖలిస్తాన్ జెండా ఎగరేస్తే 1 మిలియన్ డాలర్లను, ఇండియా గేటుపై ఎగరేస్తే 2.5 మిలియన్ డాలర్లను ఇస్తానని ప్రజల్ని ప్రేరేపించాడు.