World Cup 2023: భారతదేశం ప్రతిష్టాత్మకంగా ఐసీసీ ప్రపంచకప్ మ్యాచుల్ని నిర్వహిస్తోంది. ఇప్పటికే విదేశీ జట్లు భారత్ చేరుకున్నాయి. ఇదిలా ఉంటే ఈ మ్యాచును టార్గెట్ చేస్తూ ఖలిస్తానీ వేర్పాటువాదులు రభస చేయాలని చూస్తున్నారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో ‘ఖలిస్తాన్ జిందాబాద్’ అనే స్లోగన్స్ వెలుగులోకి వచ్చాయి. ధర్మశాలలోని జలశక్తి డిపార్ట్మెంట్ భవనం గోడపై ఈ నినాదాలు కనిపించాయి. నిందిలను పట్టుకునేందుకు అధికారులు వేట ప్రారంభించారు. విచారణ ప్రారంభించినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. కాంగ్రా ఎస్పీ షాలిని అగ్నిహోత్రి మాట్లాడుతూ.. స్పే పెయింట్ తో నినాదాలు రాసినట్లు మంగళవారం రాత్రి అధికారులకు సమాచారం వచ్చిందని చెప్పారు. ఈ ఘటన వెనక ఎవరున్నారో తెలుసుకునేందుకు ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
Read Also: India-Canada: కెనడాకు భారత్ అల్టిమేటం.. ప్రైవేటుగా చర్చిస్తామంటున్న కెనడా..
ఇదిలా ఉంటే వన్డే ప్రపంచకప్ మ్యాచులకు ముందు ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడం ఆందోళనకరంగా మారాయి. ధర్మశాల నగరంలో 5 మ్యాచులు జరగనున్నాయి. ఇప్పటికే పలు జట్ల ఆటగాళ్లు నగరానికి రావడం ప్రారంభించారు. అంతకుముందు ఖలిస్తానీ ఉగ్రవాది, సిఖ్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ ప్రపంచకప్‌ని టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇండియా, కెనడాల మధ్య ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తీవ్ర దౌత్యవివాదంగా మారింది. నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం సమస్యను పెంచింది.