Kerala: కేరళలో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, సీఎం పినరయి విజయన్ ప్రభుత్వాల మధ్య వైరం మరింత ముదిరింది. తాజాగా ఈ రోజు రాజధాని తిరువనంతపురం నుంచి కొల్లాం జిల్లాకు వెళ్తున్న సమయంలో సీపీఎంకి సంబంధించిన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) సభ్యులు గవర్నర్‌కి వ్యతిరేకంగా నల్లజెండాలను ప్రదర్శించారు. వాహనాన్ని ఆపేసిన గవర్నర్, అందులోంచి కిందకు దిగి ఆందోళన చేస్తు్న్న విద్యార్థుల వైపు నడుస్తూ.. రండి అంటూ ముందుకు వెళ్లారు. ఇది రాష్ట్రంలో సంచలనంగా మారింది. సీఎం పినరయి విజయన్ ప్రభుత్వం అన్యాయాన్ని ప్రోత్సహిస్తోందని, నిరసనకారులపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ డిమాండ్ చేశారు.
Read Also: INDIA bloc: యూపీలో 11 సీట్లు ఇచ్చేందుకు ఎస్పీ అంగీకారం.. కాంగ్రెస్ అసంతృప్తి..
ఇదిలా ఉంటే ఈ రోజు పరిణామాల నేపథ్యంలో గవర్నర్, కేరళ రాజ్‌భవన్‌కి Z+ భద్రతను పొడిగిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కేరళ రాజ్‌భవన్‌కు తెలియజేసింది. గవర్నర్, ఎస్ఎఫ్ఐ సభ్యుల మధ్య రెండు గంటల పాటు హైడ్రామా చోటు చేసుకుంది. ఆయన రోడ్డుపై బైఠాయించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ కార్యకర్తలపై నమోదైన ఎఫ్ఐఆర్ కాపీని చూపించే వరకు వెళ్లేందుకు నిరాకరించారు. చివరకు పోలీసులు 17 మంది ఎస్ఎఫ్ఐ కార్యకర్తలపై నమోదైన ఎఫ్ఐఆర్ కాపీని పోలీసులు ఆయనకు అందించారు. క్రిమినల్ కేసుల్లో ఉన్న ఎస్ఎఫ్ఐ సభ్యులను రక్షించాలని పోలీసులకు సీఎం ఆదేశాలు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల పనితీరు మరియు అసెంబ్లీ ఆమోదించిన కొన్ని బిల్లులపై సంతకం చేయడానికి గవర్నర్ నిరాకరించడం వంటి పలు అంశాలపై భిన్నాభిప్రాయాలతో గవర్నర్ ఖాన్ మరియు లెఫ్ట్ ప్రభుత్వానికి మధ్య వివాదం నడుస్తోంది.