Sabarimala pilgrimage: శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు ఆన్‌లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని కేరళలోని సీఎం పినరయి విజయన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై సర్వతా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీపీఎం ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ, కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. శబరిమలలో రాబోయే మండలం-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్‌కి ఆన్‌లైన్ బుకింగ్స్ అమలు చేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యాత్రను సజావుగా నిర్వహించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రభుత్వం సమర్థించుకుంది. ఈ నిర్ణయాన్ని కేరళ దేశస్వామ్ మంత్రి విఎన్ వాసనన్ అసెంబ్లీలో సమర్థించారు.
Read Also: Hyderabad: లంచం తీసుకోకుండా ఇంటికి రాదు.. భార్య లంచగొండితనం బయటపెట్టిన భర్త
రోజూవారీ యాత్రికుల సంఖ్యను నియంత్రించేందుకు ఆన్‌లైన్ బుకింగ్స్ అవసరమని, లేకపోతే 80,000 మించి యాత్రికులు దాటవచ్చని, ఇది లాజిస్టిక్ వ్యవస్థలపై ప్రభావం చూపిస్తున్నంది మంత్రి వాసనన్ చెప్పారు. గత సంవత్సరాల మాదిరిగానే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, దర్శనానికి స్పాట్ బుకింగ్స్ అనుమతించాలని ప్రతిపక్ష నేత వీడీ సతీషన్ కోరారు. అయితే, దీనికి సమాధానంగా.. “గతంలో, స్పాట్ బుకింగ్‌ను అనుమతించడం వలన అధిక సంఖ్యలో రద్దీ ఏర్పడింది, ఇది సౌకర్యాలు మరియు సన్నాహాలను తీవ్రంగా దెబ్బతీసింది, తీర్థయాత్ర సజావుగా నిర్వహించడానికి ఆటంకం కలిగిస్తుంది” అని వాసవన్ చెప్పారు.
అయితే, కేరళ ప్రతిపక్షాలు మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అయ్యప్ప స్వామి భక్తుల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఆన్ లైన్ బుకింగ్స్ గురించి తెలియదని, వీరిలో చాలా మంది 41 రోజుల పాటు దీక్షలో ఉంటారని, వారికి ఆన్‌లైన్ స్లాట్ లభించకపోతే దర్శనం లేకుండానే తిరిగి వెళ్లాల్సి ఉంటుందనే విషయాన్ని ప్రభుత్వానికి వివరించాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ మాట్లాడుతూ.. ఇది పాదయాత్రకు అంతరాయం కలిగించే కుట్రగా ఆరోపించారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడు నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు.