NTV Telugu Site icon

Congress: పాలస్తీనాకు మద్దతుగా కేరళ కాంగ్రెస్ ర్యాలీ..

Congress

Congress

Congress: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం కేరళ రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది. ఈ వివాదంపై ఇటు అధికార సీపీఎంతో పాటు కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా పాలస్తీనా కోసం సంఘీభావ ర్యాలీలు చేస్తున్నాయి. ఉగ్రదాడికి గురైన ఇజ్రాయిల్‌కి మద్దతు తెలుపకపోగా పాలస్తీనా, హమాస్‌కి మద్దతుగా ర్యాలీలు ఏంటని బీజేపీ ప్రశ్నిస్తోంది.

ఇదిలా ఉంటే నవంబర్ 23న కేరళలోని కోజికోడ్‌లో పాలస్తీనాకు మద్దతుగా ర్యాలీ చేయనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పాలస్తీనా ప్రజల కష్టాలను రాజకీయ లబ్ధి కోసం అధికార సీపీఎం పార్టీ వాడుకుంటోందని, దీన్ని బట్టబయలు చేసేందుకే తాము ఈ ర్యాలీని చెపడుతున్నట్లు కేరళ పీసీసీ అధ్యక్షుడు కే సుధాకరన్ అన్నారు. అమాయక పాలస్తీనియన్లను ఇజ్రాయిల్ హింసిస్తోందని, వారి భూమిని ఆక్రమించారని, దీనికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వదని, నెహ్రూ, మన్మోహన్ సింగ్ నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో పాలస్తీనియన్లు గౌరవం, శాంతితో జీవించడాని వారి పోరాటాని మద్దతు ఇచ్చిందని, కాంగ్రెస్ ఎల్లప్పుడు ఈ వైఖరినే సమర్థిస్తుందని ఆయన అన్నారు. ప్రధాని మోడీ అవలంభిస్తున్న వైఖరి భారతదేశ లౌకిక ప్రజాస్వామ్య విలువలకు అవమానకరమని సుధాకరన్ పేర్కొన్నారు.

Read Also: Canada: వీడు ‘బాల బాహుబలి’.. 6.8 కిలోల బరువుతో పుట్టాడు..

దీనికి ముందు సీపీఎం నవంబర్ 11న కోజికోడ్ లోనే పాలస్తీనా సంఘీభావ ర్యాలీని నిర్వహిస్తోంది. ఈ ర్యాలీలు కేరళలో రాజకీయ రచ్చకు వేదిక అవుతున్నాయి. దీనికి ముందు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) పార్టీ పాలస్తీనా మద్దతు ర్యాలీ వివాదాస్పదం అయింది. ఈ ర్యాలీలో హమాస్ నేత వర్చువల్ గా ప్రసంగించారు. జీహాద్‌కి సిద్ధం కావాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై కేరళ బీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై సీఎం పినరయి విజయన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించింది. బుజ్జగింపు రాజకీయాల కోసం ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుందని విమర్శించింది.