సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు. శనివారం సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తో సమావేశం అయిన ఆయన రెండున్నర గంటల పాటు దేశ రాజకీయాలపై ముచ్చటించారు. ఆ తరువాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీస్ సిసోడియాతో కలిసి సర్వోదయ స్కూల్ ను సందర్శించారు.
తాజాగా ఈ రోజు సీఎం చంఢీగడ్ వెళ్లనున్నారు. గతంలో హామీ ఇచ్చిన విధంగా రైతు ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. రైతు ఉద్యమంలో దాదాపుగా 600 మంది రైతుల చనిపోయారు. వీరందరికి చెక్కులు పంపిణీ చేయనున్నారు. దీని కన్నా ముందు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ కానున్నారు కేసీఆర్. కేజ్రీవాల్ నివాసంలో ఈ సమావేశం జరగనుంది. ప్రస్తుతం రాజకీయాలపై ఇరు నేతలు చర్చించుకోనున్నారు. మధ్యాహ్నం భోజనం తరువాత కేజ్రీవాల్ తో కలిసి చంఢీగడ్ వెళ్లనున్నారు సీఎం కేసీఆర్.
దేశ రాజకీయాలపై తన ముద్ర వేసేలా కేసీఆర్ ఇండియా టూర్ చేపట్టారు. నిన్న అఖిలేష్ యాదవ్ తో భేటీ అయిన కేసీఆర్.. సాయంత్రం ప్రముఖ జర్నలిస్ట్ ప్రణవ్ రాయ్ తో సమావేశం అయ్యారు. తాజాగా ఆదివారం అరవింద్ కేజ్రీవాల్ తో రాజకీయాలపై చర్చించనున్నారు. నిన్న సర్వోదయం స్కూల్ సందర్శన సమయంలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో సంచలనం జరగబోతోందని… మీరే చూస్తారంటూ హింట్ ఇచ్చారు. ఇదే విధంగా కేంద్రం తీసుకువస్తున్న ఎడ్యుకేషన్ పాలసీ ఏకపక్షంగా ఉందని.. రాష్ట్రాలతో సంప్రదింపులు జరపలేదని కేంద్రాన్ని విమర్శించారు.
ఇదిలా ఉంటే ఈ నెల 26న మాజీ ప్రధాని దేవెగౌడతో బెంగళూర్ లో సమావేశం కానున్నారు కేసీఆర్. ఆ తరువాత మే 27న మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధి గ్రామంలో పర్యటించనున్నారు. అక్కడ ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో సమావేశం కానున్నారు. ఈ నెల 29,30 తేదీల్లో బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. గల్వాన్ లోయలో చైనాతో జరిగిన వీర పోరాటంలో అసువులుబాసిన భారత సైనికుల కుటుంబాలను పరామర్శించనున్నారు.