Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాద దాడిలో టెర్రరిస్టులకు సహకరించిన స్థానిక కాశ్మీర్ వ్యక్తులను అధికారులు గుర్తిస్తున్నారు. పహల్గామ్ బైసరన్ లోయలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మంది పర్యాటకుల్ని పొట్టనపెట్టుకున్నారు. ఈ ఘటన జరిగిన 5 నెలల తర్వాత, భద్రతా సంస్థలు బుధవారం ఉగ్రవాదులకు లాజిస్టిక్ మద్దతు ఇచ్చిన కాశ్మీర్ వ్యక్తిని అరెస్ట్ చేశారు. కుల్గాం నివాసి అయిన 26 ఏళ్ల మహ్మద్ యూసుఫ్ కటారియాను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని 14 రోజుల పోలీస్ కస్టడీకి పంపారు.
Read Also: Finland: ‘‘భారత్ ఒక సూపర్ పవర్’’..ఫిన్లాండ్ ప్రెసిడెంట్ ప్రశంసలు..
ఉగ్రవాదుల్ని మట్టపెట్టడానికి ‘‘ఆపరేషన్ మహాదేవ్’’ని భద్రతా బలగాలు చేపట్టాయి. ఈ ఆపరేషన్లో స్వాధీనం చేసుకున్న ఆయుధాల విశ్లేషణ తర్వాత కటారియా అరెస్ట్ జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగిగా, స్థానిక పిల్లలకు పాఠాలు బోధించే కటారియా కొన్ని నెలల క్రితం ఉగ్రవాదులతో పరిచయం ఏర్పడింది. దీంతో వారి కదలికలకు సాయం చేయడం ప్రారంభించాడు. పహల్గాం ఉగ్రవాద దాడికి నెలల ముందు లష్కర్ గ్రూపుకు కుల్గాం అటవీ ప్రాంతాల గుండా ప్రయాణానికి కటారియా సాయం చేశాడని దర్యాప్తులో తేలింది.
ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులకు సహకరించిన స్థానిక వ్యక్తులు, వారి రహస్య స్థావరాలు, ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ సహాయం గురించి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు. జూన్ నెలోల లాజిస్టిక్ మద్దతు అందించిన ఇద్దరు వ్యక్తుల్ని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. వీరిని పర్వైజ్ అహ్మద్ జోథర్, బషీర్ అహ్మద్ జోథర్గా గుర్తించారు. వీరు దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదుల పేర్లను కూడా వెల్లడించారు.