Vivek Agnihotri: ‘‘ది కాశ్మీర్ ఫైల్స్’’ డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి లీగల్ నోటీసులు పంపించారు. ఈ విషయాన్ని వివేక్ అగ్నిహోత్రి మంగళవారం తెలిపారు. అయితే ఈ లీగల్ నోలీసుపై తమకు ఎలాంటి సమాచారం లేదని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. తన సినిమా ‘ది కాశ్మీర్ ఫైల్స్’ పరువు తీసినందుకు నోటీసులు పంపారు. ఇటీవల విడుదలైన ‘ది కేరళ స్టోరీ’ సినిమాను బ్యాన్ చేస్తున్నట్లు సోమవారం మమతాబెనర్జీ ప్రకటించారు. అలాగే ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సమాజంలో ఓ వర్గాన్ని కించపరిచేలా చేసిందని ఆమె విమర్శించారు. వివేక్ అగ్నిహోత్రి, ఆయన భార్య పల్లవి జోషి, నిర్మాత అభిషేక్ అగర్వాల్ కలిసి ఈ లీగల్ నోటీసులు పంపినట్లు అగ్నిహోత్రి తెలిపారు. ఈ లీగల్ కాపీని ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.
Read Also: Largest Theatres: భారతదేశంలోని టాప్-10 అతిపెద్ద సినిమా థియేటర్‌లు
వివేక్ అగ్నిహోత్రి గతేడాది రూపొందించిన కాశ్మీర్ ఫైల్స్ రికార్డ్ కలెక్షన్లు సాధించి భారీ విజయాన్ని సాధించింది. అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి నటించిన ఈ సినిమా కాశ్మీర్లో హిందువుల ఊచకోతకు సంబంధించిన వృత్తాంతం ఆధారంగా రూపొందించబడింది. అయితే ఇది తప్పుడు సమాచారం ఆధారంగా రూపొందించబడిందని, బీజేపీ అందించిన నిధుల సహకారంతో నిర్మించారని పలు విపక్షాలు ఆరోపించాయి.
ఇదిలా ఉంటే కొంతమంది బీజేపీ అందించే నిధులతో ‘బెంగాల్ ఫైల్స్’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారని మమతా బెనర్జీ మండిపడ్డారు. ఇప్పటికే కాశ్మీర్ ప్రజల్ని అవమానపరిచారని, ‘ ది కేరళ స్టోరీ’ సినిమాతో కేరళ రాష్ట్రపరువు తీశారని సోమవారం ఆమె విమర్శించారు. సుదీప్తో సేన్ దర్శకత్వంతో రూపొందిని కేరళ స్టోరి సినిమా రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. కేరళలో మతమార్పిడులు, లవ్ జీహాద్, ఉగ్రవాదం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. అయితే ఇవన్నీ కేవలం సంఘ్ పరివార్ అబద్ధపు ప్రచారమని కేరళ సీఎం పినరయి విజయన్ విమర్శించారు. తమిళనాడులో ఈ సినిమా ప్రదర్శనను మల్టీప్లెక్సుల్లో బ్యాన్ చేశారు. అయితే మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఈ సినిమాకు పన్ను మినహాయింపును ఇచ్చాయి.