NTV Telugu Site icon

Congress: ఇక తెలంగాణ, మధ్యప్రదేశ్‌పై కాంగ్రెస్ నజర్.. మే 24న మీటింగ్..

Congress

Congress

Congress: కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్ చాలా ఉత్సాహంగా ఉంది. గత 34 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఓట్లను, సీట్లను సంపాదించింది. మొత్తం 224 స్థానాల్లో పోటీ చేస్తే 135 సీట్లలో గెలుపొందింది. బీజేపీ కేవలం 66 సీట్లకు మాత్రమే పరిమితం అయింది. అంతకుముందు ఏడాది హిమాచల్ ప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది. ఇదిలా ఉంటే మరింత దూకుడుగా ఈ ఏడాది చివర్లో నాలుగు రాష్ట్రాల ఎన్నికలపై దృష్టి సారించింది. కర్ణాటక ఊపునే ఈ రాష్ట్రాల్లో చూపాలని అనుకుంటోంది.

ఈ నేపథ్యంలో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలపై నజర్ పెట్టింది. ప్రస్తుతం రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. ఇక మధ్యప్రదేశ్ విషయానికి వస్తే గత నాలుగు పర్యాయాలుగా బీజేపీ అధికారంలో ఉంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కన్నా ఎక్కువ స్థానాలు సంపాదించినా.. జ్యోతిరాధిత్య సింథియా తిరుగుబాటుతో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు క్రెడిట్ ఉన్నా కూడా గత రెండు పర్యాయాలుగా అధికారానికి దూరంగా ఉంది. దీంతో పాటు అంతర్గత విభేదాలుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఐక్యత లేకపోవడానికి కారణం అవుతున్నాయి.

Read Also: New Parliament Building: కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలి.. ప్రధాని కాదు

ఈ 4 రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమైంది. నాలుగు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలతో మే 24న అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమావేశం నిర్వహిస్తారని తెలుస్తోంది. గత రెండు దశాబ్ధాలుగా మధ్యప్రదేశ్ లో బీజేపీ నుంచి అధికారం చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 2018 ఎన్నికల్లో సింథియా వర్గీయులు 22 మంది కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. వీరంతా రాజీనామా చేయడంతో కమల్ నాథ్ ప్రభుత్వం పడిపోయింది. బీజేపీలో చేరి మళ్లీ గెలిచారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో జ్యోతిరాధిత్య సింథియా వర్గీయులతో కలిసి, బీజేపీ స్ట్రాంగ్ గా ఉంది.

ఇక రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ తో అంతర్గత విభేదాలు బజారున పడ్డాయి. సీఎం అశోక్ గెహ్లాట్, యువనేత సచిన్ పైలెట్లు బహిరంగంగానే విమర్శించుకుంటున్నారు. వీరిద్దరి మధ్య విభేదాలను చల్లార్చడానికి ప్రయత్నిస్తున్న సఫలం కావడం లేదు. అయితే రాజస్థాన్ రాష్ట్రంలో ఓటర్లు ప్రతీ సారి ప్రభుత్వాన్ని మార్చే సంస్కృతిని కలిగి ఉన్నారు. ఈ నాలుగు రాష్ట్రాల గండాన్ని కాంగ్రెస్ ఎలా అధిగమిస్తుందో చూడాలి.