NTV Telugu Site icon

Karnataka: హెల్మెట్ లేదని లాయర్‌పై పోలీసుల దాడి.. ఆరుగురు సస్పెండ్..

Karnataka

Karnataka

Karnataka: కర్ణాటక రాష్ట్రంలో ఓ లాయర్‌పై పోలీసులు దాడి చేయడం వివాదాస్పదం అయింది. ఇది పొలిటికల్ దుమారానికి తెరలేపింది.చిక్కమగళూర్‌లో బైక్‌పై వెళ్తున్న ఓ లాయర్‌పై పోలీసులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ప్రీతమ్ అనే న్యాయవాదిపై దాడి చేయడమే కాకుండా అతని బైక్ తాళాలను ట్రాఫిక్ పోలీసులు లాక్కున్నారు. ఈ ఘటన నవంబర్ 30న చోటు చేసుకుంది.

ఈ వ్యవహారం వివాదాస్పదం కావడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, దాడికి పాల్పడిన ఆరుగురు పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ట్రాఫిక్ ఉల్లంఘనకు జరిమానా చెల్లించేందుకు లాయర్ ప్రీతమ్ సిద్ధంగా ఉన్నప్పటికీ… పోలీసులు అతడిని స్టేషన్‌కి తీసుకెళ్లి రక్తం వచ్చేలా కొట్టారు. బాధిత వ్యక్తి ఛాతి, వీపు, చేతిపై రక్తపు మరకలు ఉన్నాయని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.

Read Also: Russia-Ukraine War: ప్రమాదం అంచున జపొరిజ్జియా అణు కర్మాగారం..

పోలీసుల దాడిపై చిక్కమగళూర్ న్యాయవాదుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రోడ్డెక్కారు. న్యాయవాదిని దుర్భాషలాడిన పోలీసులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు పోలీస్ అధికారుల సస్పెన్షన్‌కి వ్యతిరేకంగా వారి కుటుంబ సభ్యులు సిటి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఈ కేసులో దాడికి పాల్పడిన పోలీసులపై సెక్షన్ 307 హత్యాయత్నం, అవమానించడం, తప్పుడు నిర్భంధానికి చెందిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ చెప్పారు. ప్రస్తుతం బాధితుడు ప్రీతమ్ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడని అతను వెల్లడించారు.

ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందని అమాయకపు ప్రజలు, రైతులు, దేశభక్తి ఉన్న కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, చిక్కమగళూర్‌లో యంగ్ లాయర్ ప్రీతమ్‌పై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు చెప్పారు.