దేశ వ్యాప్తంగా జ్ఞానవాపి మసీదు వ్యవహారం చర్చనీయాంశం అయింది. వారణాసిలో కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మించారంటూ హిందు సంఘాలు చెబుతున్నాయి. ఇటీవల వారణాసి కోర్ట్ జరిపిన వీడియో సర్వేలో మసీదులోని వాజుఖానలోని కొలనులో శివలింగం బయటపడిందన్న వార్తలు బయటకు వచ్చాయి. మసీదులో వీడియో సర్వేను ఆపాలంటూ అంజుమన్ ఇంతేజామియా మసీద్ కమిటీ సుప్రీంలో పిటిషన్ వేయడం… శివలింగానికి భద్రత కల్పించాలని.. అలాగే ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉంటే దేశంలో ప్రస్తుతం మథురలో శ్రీక్రిష్ణ జన్మభూమి- షాహీ ఈద్గా మసీదు వివాదం నడుస్తోంది. దీంతో పాటు కుతుబ్ మినార్, కర్ణాటకలో మాండ్యాలో జామియా మసీదు వివాదాల్లో చిక్కుకున్నాయి. తాజాగా మరో జ్ఞానవాపిగా మంగళూర్ లోని జుమా మసీదు మారింది. దక్షిణ కన్నడ జిల్లా మంగళూరు నగర శివార్లలోని గంజిముట్ సమీపంలోని మలాలి ప్రాంతంలోని జుమా మసీదులో దేవాలయానికి సంబంధించిన నిర్మాణం బయటపడింది. వందల ఏళ్ల నాటి ఈ మసీదు పునరుద్దరణలో భాగంగా పనులు చేస్తున్న క్రమంలో దేవాలయ నిర్మాణాలు బయటపడటంతో ఒక్కసారిగా హిందు సంఘాలు యాక్టివ్ అయ్యాయి. ఒకప్పటి దేవాలయాన్ని కూల్చేసే మసీదును నిర్మించారని వీహెచ్పీ ఆరోపిస్తోంది.
ఇదిలా ఉంటే తాజాగా మలాలీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తం అయింది. మసీదుకు 500 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ విధించింది. ఈ ఆంక్షలు మే 26 ఉదయం 8 గంటల వరకు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. మసీదు సమీపంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి.