కాంగ్రెస్ సీనియర్ నాయకులు కపిల్ సిబల్ ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి.. సమాజ్ వాదీ పార్టీ మద్దతుతో రాజ్యసభ నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని వీడడంపై కపిల్ సిబల్ సంచలన విషయాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్‌కు రాజీనామా చేసి చాలారోజులైందని షాకింగ్ విషయం తెలిపారు. అయితే భవిష్యత్తులో తాను ఎస్పీతో పాటు ఏ పార్టీలోనూ చేరబోనని స్పష్టం చేశారు.
‘ఇలాంటి పరిణామాలు కష్టంగా అనిపించొచ్చు. కానీ, ప్రతి ఒక్కరూ స్వార్థంగా ఆలోచించాల్సిన అవసరమూ ఉంది. ఇప్పుడు నా సమయం వచ్చింది.
పార్లమెంట్‌లో స్వతంత్రంగా గళం వినిపించాలనుకుంటున్నా. ఏ పార్టీ కొర్రీలు తగిలించుకోవాలనుకోవట్లేదు. సుదీర్ఘకాలంగా ఓ పార్టీకి కట్టుబడి ఉండడం, ఆ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండడం చాలా చాలా కష్టమైన విషయం. ప్రతీ ఒక్కరూ వాళ్ల వాళ్ల గురించి ఆలోచించాలి. ఆ ఆచరణను అమలు చేయాలంటే కొత్తగా ఆలోచించాలి. అందుకే బయటకు రావాల్సి వచ్చింది. ప్రస్తుతం పరిస్థితులు అలాగే ఉన్నాయి.’ అంటూ ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలు వ్యాఖ్యానించారు.