దేశ రాజధాని ఢిల్లీలో ఓ ప్రముఖ వ్యాపారి కమల్ కిషోర్ కోడలు ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాసి ప్రాణాలు తీసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దీప్తి చౌరాసియా(40).. కమల పసంద్ యజమాని కమల్ కిషోర్ కోడలు. ఢిల్లీలోని వసంత్ విహార్‌లో నివాసం ఉంటారు. కమల్ కిషోర్ పాన్ మసాలా వ్యాపారం నిర్వహిస్తుంటారు. పాన్ మసాలా అనగానే చౌరాసియా కుటుంబం గుర్తుకొస్తుంది. అంతగా ఫేమస్. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ కమల పసంద్ యజమాని కోడలు దీప్తి చౌరాసియా ప్రాణాలు తీసుకుంది.

2010లో కమల్ కిషోర్ కుమారుడు హర్‌ప్రీత్ చౌరాసియాతో దీప్తికి వివాహం అయింది. ఈ దంపతులకు ఇద్దరు సంతానం ఉన్నారు. మంగళవారం సాయంత్రం ఇంట్లో దీప్తి ఉరివేసుకుంది. ఇక ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాసింది. భర్తతో ఏర్పడిన వివాదం కారణంగానే ప్రాణాలు తీసుకుంటున్నట్లు ప్రస్తావించింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
సూసైడ్ నోట్‌లో ఏముందంటే..
హర్‌ప్రీత్ రెండో వివాహం చేసుకున్నాడని దీప్తి ఆరోపించింది. ఇటీవలే దక్షిణ భారత్‌కు చెందిన ఒక సినీ హీరోయిన్‌ను పెళ్లి చేసుకున్నట్లు పేర్కొంది. భర్త రెండో పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి కుటుంబంలో వివాదం చెలరేగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.
పాన్ మసాలా..
చౌరాసియా కుటుంబం పాన్ మసాలా వ్యాపారంలో ప్రసిద్ధి చెందింది. కమల్ కిషోర్-అతని తండ్రి కమలా కాంత్ చౌరాసియా కలిసి కమలా పసంద్ బ్రాండ్‌ను స్థాపించారు. ఈ బ్రాండ్ కాన్పూర్, ఢిల్లీ, కోల్‌కతా, ముంబైలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కమలా కాంత్ దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం కాన్పూర్‌లో పాన్ మసాలాను అమ్మడం ప్రారంభించారు. అతి కొద్ది కాలంలోనే పురోగతి సాధించింది. ప్రస్తుతం కంపెనీ బిలియన్ల రూపాయల టర్నోవర్ నడుస్తోంది.