Kamal Haasan: నటుడు-రాజకీయ నాయకుడు కమల్ హాసన్ బీజేపీ, కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోడ్ ఎంపీ స్థానంలో పోటీ చేస్తున్న డీఎంకే అభ్యర్థి కేఈ ప్రకాష్‌కి మద్దతుగా ప్రచారం చేశారు. తమిళనాడుకు కేంద్రం ఇస్తున్న పన్నుల వాటాను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. కేంద్రం ప్రభుత్వానికి అందించిన ప్రతీ రూపాయిలో కేవలం 29 పైసలు మాత్రమే రాష్ట్రానికి తిరిగి వస్తున్నట్లు ఆరోపించారు.
Read Also: Mrunal Thakur: చావు భయపెడుతోంది.. మృణాల్ షాకింగ్ కామెంట్స్
దేశం నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీని తరిమికొట్టినప్పటికీ.. ఇప్పుడు పశ్చిమ భారతదేశం నుంచి మరో కంపెనీ వచ్చిందని బీజేపీ గుర్తించి ఎద్దేవా చేశారు. అది గాంధీ పుట్టిన ప్రదేశమని చెప్పారు. పరోక్షంగా ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ గురించి ప్రస్తావిస్తూ బీజేపీని విమర్శించారు. కేంద్రం వసూలు చేసిన పన్ను రాబడి సోదరులకు(ఉత్తరాది రాష్ట్రాలకు) చేరిందో లేదో తెలియదు, ఎందుకంటే వారు కూడా కూలీ పనికోసం తమిళనాడుకు వస్తారని కమల్ హాసన్ అన్నారు. కేంద్రం వసూలు చేసిన పన్నులు ఎక్కడికి వెళ్తున్నాయని ప్రశ్నించారు.
2018లో మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) పార్టీని స్థాపించిన కమల్ హాసన్ డీఎంకేతో పొత్తు పెట్టుకున్నారు. డీఎంకే – కాంగ్రెస్ ఇతర తమిళపార్టీలు భాగంగా ఉన్న ఇండియా కూటమిలో చేరారు. ఒక రాజ్యసభ స్థానాన్ని కమల్ హాసన్ పార్టీ ఆశిస్తోంది. ఇందుకు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కూడా హామీ ఇచ్చారు. 2025లో రాజ్యసభ సీటు ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం కమల్ హాసన్ పార్టీలో పోటీ చేయడం లేదు, కానీ డీఎంకే, కాంగ్రెస్ అభ్యర్థుల తరుపున ఆయన ప్రచారం చేసేందుకు అంగీకరించారు.