Kamal Haasan Backs Vetrimaaran And Said No Hindu religion in Chola times: రాజ రాజ చోళుడు ‘హిందూ రాజు కాదు’ అని డైరెక్టర్ వెట్రిమారన్ చేసిన వ్యాఖ్యల్ని విశ్వనాయకుడు కమల్ హాసన్ సమర్థించారు. అంతేకాదు.. రాజ రాజ చోళుడి కాలంలో ‘హిందూ మతం’ అనేదే లేదని కుండబద్దలు కొట్టారు. ఆరోజుల్లో వైనం, శైవం, సమనం మాత్రమే ఉన్నాయని.. అయితే బ్రిటీష్‌వాళ్లు మన భారతదేశంలోకి అడుగుపెట్టిన తర్వాత వాటిని సమిష్టిగా ఎలా పిలవాలో తెలియక ‘హిందువులు’గా సంబోధించారని అన్నారు. తూత్తుకుడిని టుటికోరిన్‌గా ఎలా మార్చారో.. ఆ మూడు వర్గాల్ని ‘హిందూ’గా మార్చడం జరిగిందని కమల్ హాసన్ వివరణ ఇచ్చారు.
ఇదే సమయంలో ఆయన ‘కళ’కు భాష, కులం, మతం వంటి బేధాలు ఉండవని.. వీటి ప్రాతిపదికన సినీ పరిశ్రమలో రాజకీయాలు చేయడం ఏమాత్రం మంచిది కాదని కమల్ హాసన్ హితవు పలికారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాన్ని ఆదరించడం లేదని వివాదం సృష్టిస్తున్నారని, అది సరికాదని సూచించారు. గతంలో తమిళలు ‘శంకరాభరణం’ అనే తెలుగు సినిమాను ఆదరిస్తే, తెలుగువారు ‘మరో చరిత్ర’ అనే తమిళ చిత్రాన్ని ఆదరించారని గుర్తు చేశారు. అసలు సినిమాకు భాషా బేధాలు అనేవే లేవని.. ఏ భాషలో అయినా మంచి సినిమా వస్తే, ప్రేక్షకులు దాన్ని కచ్ఛితంగా ఆదరిస్తారని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు.
ఇదిలావుండగా.. రాజ రాజ చోళుడు హిందూ రాజు కాదని, కానీ పొన్నియిన్ సెల్వన్ సినిమాలో దర్శకుడు మణిరత్నం ఆ రాజుని హిందువుగా చూపించారంటూ దర్శకుడు వెట్రిమారన్ అన్నాడు. ఆ రాజుతో పాటు తిరువళ్లువర్‌కి కాషాయ రంగు జెండా కూడా కప్పారని.. సినీ పరిశ్రమలో కాషాయరంగు పులుముకుంటోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్నుంచే హిందుత్వం మీద తమిళనాడులో జోరుగా చర్చలు సాగుతున్నాయి.