ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరూ ఊహించని పేరును కాంగ్రెస్ ప్రకటించింది. తెలంగాణకు చెందిన బి.సుదర్శన్‌రెడ్డి పేరును కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు. రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని కాంగ్రెస్ పోటీలోకి దింపింది. ఎన్డీఏ కూటమి తమిళనాడు వ్యక్తిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెెట్టగా.. ఇండియా కూటమి దక్షిణాదికి చెందిన తెలంగాణ వ్యక్తిని పోటీగా దింపింది. ఇప్పుడు రాధాకృష్ణన్-సుదర్శన్‌రెడ్డి మధ్య పోటీ నెలకొంది.
ఇది కూడా చదవండి: Trump-Zelensky: వైట్‌హౌస్‌లో ట్రంప్-జెలెన్‌స్కీ నవ్వులు.. పువ్వులు.. వీడియో వైరల్
బి.సుదర్శన్‌రెడ్డి.. స్వస్థలం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం. వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యను అభ్యసించారు. నాలుగేళ్ల పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు. ఇక రిటైర్మెంట్ తర్వాత గోవా లోకాయుక్త ఛైర్మన్‌గా పని చేశారు.
సుదర్శన్‌రెడ్డి 1971లో న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 1995లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005లో గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. 2007 జనవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జూలై 2011లో పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత గోవా తొలి లోకాయుక్త ఛైర్మన్‌గా పనిచేశారు.
ఇది కూడా చదవండి: Modi-Putin: మోడీకి పుతిన్ ఫోన్ కాల్.. అలాస్కా వివరాలు వెల్లడి
వాస్తవానికి సంఖ్యా బలాన్ని బట్టి చూస్తే ఎన్డీఏ కూటమినే ఉపరాష్ట్రపతి పదవిని గెలుచుకుంటుంది. అయినా కూడా తమ ఐక్యతను చాటిచెప్పాలని ఇండియా కూటమి భావిస్తోంది. ఇందులో భాగంగానే ప్రతిపక్ష కూటమి అభ్యర్థిని నిలబెడుతోంది. ప్రస్తుతం మొత్తం ఉభయ సభల సభ్యుల సంఖ్య 782గా ఉంది. సింపుల్ మెజారిటీతో 392 ఓట్లు వచ్చిన అభ్యర్థే గెలుపొందుతారు. ఉభయ సభల్లో ఎన్డీఏ కూటమి బలం 422గా ఉంది. లోక్‌సభలో 293 ఎన్డీఏ కూటమి పక్షాల సభ్యులు, రాజ్యసభలో 129 మంది ఉన్నారు.
ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9న జరగనుంది. అయితే ఏకగ్రీవం కోసం ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా రాజ్‌నాథ్‌సింగ్ ఇండియా కూటమిని సంప్రదించగా.. ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తికి సపోర్ట్ చేయమని తేల్చి చెప్పినట్లు సమాచారం.