NTV Telugu Site icon

Sourav Ganguly: సుప్రీంకోర్టు త్వరగా తీర్పు ఇవ్వాలని దాదా విజ్ఞప్తి..

Ganguly

Ganguly

Sourav Ganguly: పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని ఆర్జీ కర్‌ ఆస్పత్రిలో జూనియర్‌ వైద్యురాలిపై అత్యంత పాశవికంగా దుండగులు దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటన దేశాన్ని కుదిపేయడంతో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ చేస్తుంది. ఇక, కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ హత్యాచార ఘటన కేసులో సుప్రీంకోర్టు వీలైనంత త్వరగా తీర్పునివ్వాలని టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ కోరారు. బాధితురాలికి న్యాయం చేయడంతో పాటు.. ఇలాంటి దారుణాలకు పాల్పడాలనే ఆలోచన వచ్చినా వణుకుపుట్టేలా తీర్పు ఉండాలని దాదా పేర్కొన్నాడు. కాగా, ఈ క్రమంలో కేసు సుప్రీంకోర్టుకు చేరగా.. ఘటనకు సంబంధించిన విచారణ చేసిన నివేదికను సెప్టెంబరు 17వ తేదీ లోగా సమర్పించాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ (సోమవారం) జరిగిన విచారణలో భాగంగా ఈ మేరకు గడువును న్యాయస్థానం విధించింది.

Read Also: Stree 2: స్త్రీ 2 సరికొత్త రికార్డు.. హిందీలోనే సెకండ్!!

అయితే, బాధితురాలికి మద్దతుగా జరిగిన ఉద్యమంలో ఎంతో మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పోరాటం చేస్తున్నారని సౌరవ్ గంగూలీ అన్నారు. రాజకీయాలకు అతీతంగా వీధుల్లో ఆందోళన బాట పట్టారని చెప్పారు. వారందరికీ న్యాయం జరగాలి.. న్యాయస్థానం విచారణ ప్రక్రియకు సమయం పడుతుందనే విషయం తెలుసు.. కానీ, వీలైనంత సత్వరంగా తీర్పును ఇవ్వాలని అభ్యర్థించారు.. ప్రపంచం మొత్తానికి ఈ తీర్పు ఆదర్శంగా ఉండాలని దాదా అన్నారు. చెడు ఆలోచనలు చేసే వారి గుండెల్లో ఈ తీర్పుతో గుబులుపుట్టేలా ఉండాలన్నారు. బాధితురాలికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరు న్యాయం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారని గంగూలీ వెల్లడించారు.