Nitish Kumar: బిహార్ రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించారు జేడీయూ అధినేత నితీష్ కుమార్. బీజేపీకి రెండోసారి షాక్ ఇస్తూ ఎన్డీయే కూటమి నుంచి జేడీయూ బయటకు వచ్చేసింది. ఇప్పటివరకు ప్రత్యర్థులుగా ఉన్న ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో చేతులు కలిపింది. ఆ పార్టీలతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఏర్పాటు చేయనున్నారు. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. నితీష్ కుమార్ ఎత్తుగడతో బిహార్ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయినట్లు అయింది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామమక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు నితీష్. బిహార్ ముఖ్యమంత్రిగా 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్న నితీష్.. ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవకపోవడం గమనార్హం.
నితీశ్ కుమార్ 2005 నుంచి ఇప్పటివరకు మొత్తం ఏడు పర్యాయాలు బిహార్ సీఎంగా సేవలందించారు. ప్రథమంగా 2000 సంవత్సరంలో ఎనిమిది రోజుల పాటే ముఖ్యమంత్రిగా కొనసాగినప్పటికీ.. ఆ తర్వాత 2005, 2010, 2015, 2017, 2020లో సీఎంగా బాధ్యతలు నిర్వహించి బిహార్‌లో తిరుగులేని నేతగా కొనసాగుతున్నారు. అయితే, ఏడు సార్లు ముఖ్యమంత్రి అయినా ఆయన ఎమ్మెల్యేగా ఎక్కడి నుంచీ ప్రాతినిధ్యం వహించకపోవడం గమనార్హం. ఎందుకంటే శాసనమండలి సభ్యుడిగా ఉంటూ ఆయన సీఎంగా సేవలందిస్తూ వస్తున్నారు. 1977లో నితీష్ కుమార్ నలంద జిల్లాలోని హర్నాట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ 1985లో అక్కడి నుంచి పోటీ చేసి రికార్డు మెజారిటీతో విజయం సాధించారు. అనంతరం 1989, 1991, 1996, 1998, 1999, 2004 వరుసగా ఆరు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడం 1985లోనే చివరి సారి.అప్పటి నుంచి ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. తొలిసారి 2000లో సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు ఆయన ఏ సభలోనూ సభ్యుడు కాదు. అయితే, అసెంబ్లీలో తనకు సరైన మెజారిటీ లేకపోవడంతో కేవలం ఎనిమిది రోజులకే రాజీనామా చేయాల్సి వచ్చింది.
Bihar Political Crisis: గవర్నర్‌ను కలిసిన నితీష్ కుమార్, తేజస్వి యాదవ్.. ప్రభుత్వ ఏర్పాటుపై లేఖ
2005లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ కూటమి విజయం సాధించగా.. నితీష్ రెండో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పుడు కూడా ఆయనకూ ఏ సభలోనూ సభ్యత్వం లేదు. కానీ 2006లో నితీష్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ పదవీకాలం 2012 వరకు ఉండగానే 2010లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీజేపీ – జేడీయూ కూటమి భారీ మెజారిటీ గెలిచి అధికారంలోకి వచ్చింది. ఆయన వరుసగా మూడోసారి సీఎంగా ప్రమాణం చేశారు. 2012లో ఎమ్మెల్సీగా తన పదవీ కాలం ముగియడంతో మళ్లీ మండలికే ఎన్నికయ్యారు. 2013లో బీజేపీతో స్నేహాన్ని తెంచుకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయగా.. జేడీయూకి ఘోర పరాభవం ఎదురైంది. దీనికి బాధ్యత వహిస్తూ నితీష్ కుమార్ సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. జేడీయూలో ఉన్న జితిన్ రాం మాంఝీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2015 ఫిబ్రవరిలో జితిన్ రాం మాంఝీ జేడీయూ నుంచి బహిష్కరణకు గురవ్వడంతో నితీశ్ నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. తర్వాత 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో మహాకూటమిగా బరిలోకి దిగి విజయం సాధించిన ఆయన ఐదోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
Bihar Political Crisis: బిహార్ ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా
ఆర్జేడీ నుంచి లాలూ తనయుడు తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతల్లో ఉన్నారు. ఆ సమయంలో తేజస్వీపై అవినీతి ఆరోపణలు రాగా.. నితీశ్ ఆయన్ను కేబినెట్ నుంచి తొలగించారు. దీనికి ఆర్జేడీ తీవ్ర అభ్యంతరం చెప్పగా 2017 జులైలో నితీశ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో మహా కూటమి చీలిపోయింది. అనంతరం కొద్ది గంటల్లోనే బిహార్‌లోని రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. మళ్లీ ఎన్డీఏతో దోస్తీ కట్టిన నితీశ్ కొద్ది గంటల్లోనే మళ్లీ సీఎం పీఠం దక్కించుకున్నారు. 2018లో మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన నితీశ్ పదవీ కాలం 2024 నాటికి పూర్తి కానుంది. 2020లో జరిగిన ఎన్నికల్లో బీజేపీతో కలిసి జేడీయూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నితీష్ కుమార్ ఏడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం మళ్లీ బీజేపీతో జేడీయూ తెగదెంపులు చేసుకుంది. ఆర్జేడీ-కాంగ్రెస్-వామపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు జేడీయూ సిద్ధమైంది. నితీష్ కుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం 8వ సారి కానుంది. ఆయన మొదటి నుంచి కూడా ఎమ్మెల్సీ హోదాలోనే ముఖ్యమంత్రి పదవిని దక్కించుకోవడం గమనార్హం. ప్రజలను నేరుగా ఎదుర్కొనేందుకు ఆయనపై రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తూ ఉంటారు. కానీ ఆయన ఒక్కస్థానానికే పరిమితం కావాలనుకోవడం లేదని.. అందుకే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పుకొచ్చారు.