జమ్మూ కాశ్మీర్ లో గురువారం ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. ప్రభుత్వం ఉద్యోగి అయిన కాశ్మీరీ పండిట్ రాహుల్ భట్ ను కార్యాలయంలోనే హత్య చేశారు. బుద్గాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చాదూరా పట్టణంలోని తహసీల్ కార్యాలయంలో అక్కడ క్లర్క్ గా పనిచేస్తున్న రాహుల్ భట్ ను దగ్గర నుంచి షూట్ చేశారు. ఉగ్రవాదాలు రాహుల్ భట్ ఎవరని ఆరా తీస్తూ… కాల్పులు జరిపారు.
తాజాగా శుక్రవారం రాహుల్ భట్ అంత్యక్రియలు జరిగాయి. కాశ్మీర్ లోని పండిట్లు పెద్ద ఎత్తున అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఉగ్రవాదులు కాశ్మీర్ పండిట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ లో లెఫ్టినెంట్ జనరల్ పాలనపై విమర్శలు చేశారు. కాశ్మీర్ లో బుద్గాం, అనంత్ నాగ్ జిల్లాల్లో కాశ్మీర్ పండిట్ అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేశారు. తమకు ప్రభుత్వం రక్షణ కల్పించకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. ఒకానొక దశలో పోలీసులు టియర్ గ్యాస్ ఫైర్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆందోళనకారులు బుద్గాంలోని ఎయిర్ పోర్టుకు ర్యాలీగా వెళ్తున్న క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
ఇదిలా ఉంటే వరస ఎన్ కౌంటర్లలో టెర్రరిస్టులను, భద్రతా బలగాలు హతమారుస్తున్నాయి. దీంతో ఎలాగైనా తమ ఉనికిని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే టెర్రరిస్టులు అమాయకులైన పండిట్లను టార్గెట్ చేస్తున్నారు. గతంలో బీహార్, యూపీ ఇతర ప్రాంతాలకు చెందిన నాన్ లోకల్స్ పై టెర్రరిస్టులు కాల్పులు జరిపి హతమార్చారు. లష్కర్-ఏ- తోయిబా అనుబంధ సంస్థగా ఉన్న ‘ ది రెసిస్టెంట్ ఫోర్స్’ ఈ ఘటనలకు పాల్పడింది. అయితే ఆ తరువాత ఈ ఘటనలకు పాల్పడిన వ్యక్తులను వరసగా లేపేసింది ఆర్మీ. ప్రస్తుతం మరోసారి కాశ్మీర్ పండిట్ పై దాడి చేసి ప్రజల్లో భయాందోళన పెంచాలని ఉగ్రవాదులు ఎత్తుగడలు వేస్తున్నారు.