Site icon NTV Telugu

Jairam Ramesh: ఏదో బలమైన కారణమే ఉంది.. ధన్‌ఖర్ రాజీనామాపై జైరాం రమేష్ వ్యాఖ్య

Ramesh

Ramesh

ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖర్ రాజీనామా చేయడం రాజకీయ నాయకులకు దిగ్భ్రాంతి కలిగించింది. సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో ధన్‌ఖర్ ఉల్లాసంగానే కనిపించారు. అలాగే ఆయా పార్టీలకు చెందిన నాయకులతో కూడా ఉత్సాహంగానే సమావేశాలు నిర్వహించారు. కానీ సాయంత్రానికి ఏమైందో.. ఏమో తెలియదు గానీ.. ఉన్నట్టుండి ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ధన్‌ఖర్ ప్రకటించారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. అనారోగ్య కారణాల చేత పదవి నుంచి వైదొలగుతున్నట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Gita Gopinath: గీతా గోపీనాథ్‌ సంచలన నిర్ణయం.. ఐఎంఎఫ్‌ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడి

అయితే ధన్‌ఖర్ రాజీనామాపై ప్రతిపక్ష పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏదో బలమైన కారణం ఉండొచ్చని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘ధన్‌ఖర్ సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు బిజినెస్‌ అడ్వైజరీ కమిటీకి అధ్యక్షత వహించారు. జేపీ నడ్డా, కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజుతో సహా పలువురు దీనికి హాజరయ్యారు. చర్చ అనంతరం సాయంత్రం 4.30కు మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. అయితే మరోసారి భేటీకి రిజిజు, నడ్డా రాలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ధన్‌ఖర్ మంగళవారం మధ్యాహ్నానికి వాయిదా వేశారు. దీన్ని బట్టి నిన్న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4.30 మధ్య ఏదో పెద్ద విషయమే జరిగింది.’’ అని జైరాం రమేష్ అనుమానం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Vice-President: తదుపరి ఉపరాష్ట్రపతిగా పేర్లు పరిశీలన..! ఆ పార్టీ నేతకు ఛాన్స్!

‘‘రిజిజు, నడ్డా ఉద్దేశపూర్వకంగానే సమావేశానికి గైర్హాజయ్యారు. ఈ క్రమంలోనే ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ధన్‌ఖర్ ప్రకటించారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా ఇలా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దాన్ని మనం గౌరవించాలి. కానీ, అందుకు చాలా లోతైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది’ అని జైరాం రమేశ్‌ రాసుకొచ్చారు.

2022 ఆగస్టు 11న ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ధన్‌ఖర్‌కు 2027 ఆగస్టు వరకూ పదవీకాలం ఉంది. అంటే రెండేళ్లకు ముందుగానే పదవి నుంచి తప్పుకున్నారు. రాజ్యసభ సమావేశాలను ప్రస్తుతానికి డిప్యూటీ ఛైర్మన్‌గా ఉన్న జేడీయూ నేత హరివంశ్‌ నడిపించనున్నారు. ఇక తదుపరి ఉపరాష్ట్రపతి రేసులో కూడా హరివంశ్ ముందున్నారు. త్వరలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరనున్నాయి. ఈ నేపథ్యంలో మిత్రపక్షంగా ఉన్న జేడీయూకు ఆ పదవి దక్కే అవకాశం ఉంది.

Exit mobile version