Israel:గాజాలో ఇజ్రాయిల్ విధ్వంసం సృష్టిస్తోంది. దక్షిణ గాజాలోని రఫాలో యూఎస్ నిధులతో నడిచే ఒక సహాయక పంపిణీ కేంద్రం సమీపంలో ఇజ్రాయిల్ దళాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 30 మంది పాలస్తీనియన్లు మరణించారు. 115 మందికి పైగా గాయపడ్డారు. ఆదివారం ఉదయం వేలాది మంది పాలస్తీనియన్లు సహాయక కేంద్రం వద్ద గుమిగూడినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఇజ్రాయిల్ ట్యాంకులు జనంపైకి కాల్పులు జరిపినట్లు పాలస్తీనా జర్నలిస్టులు చెబుతున్నారు.
మృతులను, గాయపడిన వారిని గాడిద బండ్లపై సంఘటనా స్థలం నుంచి తరలించారు. ఈ సంఘటనపై హమాస్ స్పందించింది. మానవతా సాయం కోసం పంపిణీ కేంద్రాల వద్ద ఆకలితో గుమిగూడిన పౌరులను ఇజ్రాయిల్ ఊచకోత కోసిందని హమాస్ ఆరోపించింది. అవి “మానవతా సహాయ కేంద్రాలు కాదు, సామూహిక మరణ ఉచ్చులు” అని పిలిచింది.
Read Also: Sharmishta Panoli: శర్మిష్ట పనోలి ఎవరు.? మమతా సర్కార్ ఎందుకు అరెస్ట్ చేసింది..
తాజాగా అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణకు హమాస్ తన నిర్ణయాన్ని వెల్లడించిన గంటల్లోనే ఈ సంఘటన జరిగింది. యుద్ధంతో దెబ్బతిన్న గాజాలో మానవతా సంక్షోభంపై ఇజ్రాయెల్ అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. మార్చిలో కాల్పుల విరమణ ఒప్పందం రద్దు అయినప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజా వ్యాప్తంగా దాడులను విస్తృతం చేసింది. పూర్తిగా గాజాను ఇజ్రాయిల్ దిగ్బంధించింది.
హమాస్ అక్టోబర్ 7, 2023న దాడి సమయంలో 251 మంది బందీలుగా పట్టుకుంది. వీరిలో 57 మంది గాజాలోనే ఉన్నారు, ఇందులో 34 మంది మరణించారని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. మార్చి 18న ఇజ్రాయెల్ తన దాడిని తిరిగి ప్రారంభించినప్పటి నుండి ఈ ప్రాంతంలో కనీసం 4,117 మంది మరణించారని, యుద్ధంలో మొత్తం మృతుల సంఖ్య 54,381కి చేరుకుందని, వీరిలో ఎక్కువ మంది పౌరులేనని హమాస్ ఆధీనంలో ఉన్న గాజాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. అక్టోబర్ 07 నాటి హమాస్ దాడిలో 1,218 మంది మరణించారు, వీరిలో ఎక్కువ మంది పౌరులు ఉన్నారు.