Sharmishta Panoli: ‘‘ఆల్ ఐస్ ఆన్ షర్మిష్ట’’ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. షర్మిష్టకు న్యాయం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ‘‘ఆపరేషన్ సిందూర్’’పై సోషల్ మీడియాలో మతపరమైన మనోభావాలను దెబ్బతీసే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే కారణంగా బెంగాల్ పోలీసులు శుక్రవారం గురుగ్రామ్ నుంచి అరెస్ట్ చేశారు. నాలుగో సంవత్సరం లా చదువుతున్న శర్మిష్ట పనోలికి ఇప్పుడు చాలా మంది నుంచి మద్దతు లభిస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆమెకు మద్దతు తెలిపారు. ఆమె అరెస్ట్‌పై బెంగాల్ బీజేపీ తీవ్రంగా స్పందిస్తోంది. షర్మిష్టకు న్యాయ సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ప్రస్తుతం, బెంగాల్‌లోని అలీపూర్ కోర్టు ఆమెకు 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
శర్మిష్ట పనోలి ఎవరు..?
శర్మిష్ట పనోలి పూణేలోని ఒక లా స్కూల్ లో నాల్గవ సంవత్సరం చదువుతున్నట్లు ఆమె లింక్డ్ఇన్ ప్రొఫైల్ తెలిపింది. ఆమెకు 94,000 మందికి పైగా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్నారు. పలు రాజకీయ అంశాలపై ఆమె వీడియోలు చేస్తూ ఫేమస్ అయింది.
శర్మిష్ట పనోలి ఏం చేసింది..?
ఆమె ఇన్‌స్టాలో ఒక వివాదాస్పద పోస్ట్ షేర్ చేసిన తర్వాత వివాదం ప్రారంభమైంది. తర్వాత ఈ పోస్టును ఆమె డిలీట్ చేసింది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకుల్ని టెర్రరిస్టులు బలి తీసుకున్న తర్వాత పాకిస్తాన్‌కి చెందిన ఓ యూజర్ భారత సైనిక చర్యని ప్రశ్నించాడు. దీనికి ప్రతిస్పందనగా ఆమె ఒక వీడియో చేసింది. ఈ వీడియోలో ఆమె అనుచితంగా మాట్లాడారని, బాలీవుడ్ ప్రముఖులు, యూట్యూబర్ రణ్‌వీర్ అల్లాబాడియా పాకిస్తాన్ అనుకూల వైఖరి తీసుకుంటున్నారని విమర్శించారు. ఆమె అభ్యంతరకమైన భాషలో విమర్శించారని కేసు నమోదైంది.
షర్మిష్ట పనోలి అరెస్ట్..
ఓ వర్గం నుంచి వ్యతిరేకత వచ్చిన తర్వాత, ఈ వీడియోను ఆమె డిలీట్ చేసి, క్షమాపణలు చెప్పింది. అయితే, మత సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించినందుకు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ల కింద అధికారులు ఆమెపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వెంటనే ఆగ్రహాన్ని రేకెత్తించింది, కఠినమైన చట్టాల ప్రకారం ఆమెను అరెస్టు చేయాలని చాలా మంది డిమాండ్ చేశారు.
లీగల్ నోటీసులు అందించేందుకు కోల్‌కతా పోలీసులు ప్రయత్నించినప్పటికీ ఆమె అందుబాటులోకి రాలేదు. శుక్రవారం గురుగ్రామ్ నుంచి బెంగాల్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. మే 31న ఆమెను అరెస్టు చేయడానికి కోర్టు వారెంట్ జారీ చేసింది. అలీపోర్ కోర్టు ఆమెకు బెయిల్ నిరాకరించి జూన్ 13 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.