Iran: తాజ్ మహల్ చరిత్ర తెలిస్తే అక్కడికి వెళ్లేవాడే కాదు.. మార్కోరూబియోపై ఇరాన్ సెటైర్లు..

  • తాజ్ మహల్ సందర్శించిన అమెరికా విదేశాంగ కార్యదర్శి..
  • చరిత్ర తెలిస్తే అక్కడికి వెళ్లేవారు కాదు: ఇరాన్ సెటైర్లు..
Marco Rubio

Marco Rubio

Iran: అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత్‌లో పర్యటిస్తున్నారు. సోమవారం ఆయన తన భార్య జీనెట్ రూబియోతో కలిసి ఆగ్రాలోని తాజ్ మహల్‌ను సందర్శించారు. ఈ ఫోటోను ఆయన ఎక్స్‌లో షేర్ చేశారు. అయితే, తాజ్ మహల్ సందర్శనపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ రూబియోపై విమర్శలు చేసింది. తాజ్ మహల్‌కు ఇరాన్‌తో ఉన్న సంబంధాన్ని పంచుకుంది.

‘‘మార్కో రూబియోకు తాజ్ మహల్ చరిత్ర గురించి తెలిసి ఉంటే అక్కడ ఫోటోలకు ఫోజ్ ఇచ్చే వారు కాదు’’ అని ఇరాన్ వ్యాఖ్యానించింది. ఒక ఇరానియన్ మహారాణి ప్రేమకు గుర్తుగా నిర్మించిన ఈ అద్భుతాన్ని ఇరాన్ ఆర్కిటెక్టులు రూపొందించారని, కానీ ఇదే సమయంలో ఇరాన్ చరిత్రను నాశనం చేస్తామని అమెరికా బెదిరిస్తోందని విమర్శించింది. ఇటీవల, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ నాగరికతను అంతం చేస్తామని హెచ్చరించారు. దీనికి ప్రతిగా ఇరాన్ స్పందిస్తూ.. అమెరికా చరిత్ర కేవలం 250 ఏళ్లు మాత్రమే, కానీ ఇరాన్ నాగరికత వేల ఏళ్లది అని చెప్పింది.

ఇరాన్, తాజ్ మహల్ సంబంధం..

మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం 1632లో తాజ్ మహల్‌ను కట్టించారు. ముంతాజ్ అసలు పేరు అర్జుమంద్ బాను బేగమ్. ఈమె కుటుంబం పర్షియాకు చెందినది. ఆమె తాత మిర్జా ఘియాస్ బేగ్ ఇరాన్ నుంచి భారత్ వచ్చి మొఘల్ రాజసభలో కీలక స్థానంలో పనిచేశారు. తాజ్ మహల్ నిర్మాణం కూడా పర్షియన్ శైలిని పోలి ఉంటుంది. ఇరాన్ లోని షిరాజ్‌కు చెందిన కళాకారుడు అబ్దుల్ హక్ దీన్ని డిజైన్ చేసినట్లు చెబుతారు.