డిసెంబర్ 15 తర్వాత అంతర్జాతీయ విమాన సర్వీసులు పున: ప్రారంభం అవుతాయని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశానికి మరియు ఇతర దేశాలతో షెడ్యూల్ చేయబడిన వాణిజ్య అంతర్జాతీయ విమాన సేవలను పునఃప్రారంభించే విషయాన్ని, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో సంప్రదించి పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా గత ఏడాది మార్చి నుండి భారతదేశానికి మరియు ఇతర దేశాలకు షెడ్యూల్ చేయబడిన అంతర్జాతీయ ప్రయాణికుల విమానాలు నిలిపివేయబడ్డాయి.
అంతర్జాతీయ విమానాలను నడపడానికి భారతదేశం 25 కంటే ఎక్కువ దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందాన్ని కలిగి ఉందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇప్పటికే కోవిడ్ కారణంగా అంతర్జాతీయ సర్వీసులు నిలిచిపోవడంతో చాలా మంది భారత్‌లోనే ఉండిపోయారు. ఈ ప్రకటనతో ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికులకు కొంత ఊరట కలగనుంది. కాగా కోవిడ్ నియమ, నిబంధనలను అనుసరించి ప్రయాణాలు చేయాల్సి ఉంటుందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పేర్కొంది.