Instagram reels: కొందరు రీల్స్ పిచ్చి పరాకాష్టకు చేరుకుంటోంది. సోషల్ మీడియాలో వీడియోల వ్యూస్ కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. కొందరు ఇలాంటి వాటి వల్ల ప్రాణాలు కోల్పోతుంటే, మరికొందరు ఇతరు ప్రాణాలు కోల్పోయేందుకు కారణమవుతున్నారు. తాజాగా, మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో వదిన, మరిది రీల్స్ పిచ్చి ఏకంగా 8 ఫ్లాట్లను దగ్ధం చేసింది. వీరిద్దరు కూడా తీవ్ర గాయాలపాలయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌కి చెందిన రంజనా జాట్ అనే మహిళ, తన 38 ఏళ్ల బంధువు అనిల్ జాట్‌తో కలిసి మొదటి అంతస్తులో రీల్స్ రికార్డ్ చేయడం ప్రారంభించారు. అయితే, సోషల్ మీడియాలో వ్యూస్ దక్కించుకునేందుకు ఏదైనా వెరైటీగా చేద్దామని ఫిక్స్ అయ్యి, ఎల్‌పీజీ గ్యాస్ లీక్ చేసి రీల్ తీయడం ప్రారంభించారు. అయితే, అకాస్మత్తుగా భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. నగరంలోని భిండ్ రోడ్డులోని ది లెగసీ ప్లాజా భవనంలో ఆదివారం తెల్లవారుజామున 2.15 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
Read Also: IND vs NZ: చాహల్ కొత్త గర్ల్ ఫ్రెండ్.. స్టేడియంలో ఫైనల్ చూస్తూ ఎంజాయ్!
రంజనా ఉద్దేశపూర్వకంగా గ్యాస్ సిలిండర్ పిన్ తీసేసి గ్యాస్‌ని కావాలని లీక్ చేసింది. దాదాపుగా 17 నిమిషాల పాటు దీనిని చిత్రీకరించారు. అయితే, అపార్ట్‌మెంట్ మొత్తం గ్యాస్ ఛాంబర్‌గా మారడంతో, ఏం కనిపించకపోవడంతో, వెలుతురు కోసం అనిల్ లైట్ ఆన్ చేయడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీని వల్ల స్పార్క్ సంభవించి పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు రంజనా బెడ్ రూం ధ్వంసమైంది. పొరుగువారి ఫ్లాట్లు దెబ్బతిన్నాయి. వీరిద్దరూ రాత్రి సమయంలో ఇలా విన్యాసాలు చేస్తూ వ్యూస్ కోసం, సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసం పిచ్చి పనులు చేస్తున్నారని తేలింది. అనిల్ మొబైల్ ఫోన్‌లో ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి. వీరిద్దరిపై అధికారులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 287 కింద కేసు నమోదు చేశారు.