రాజస్తాన్ కేబినెట్ మంత్రి మహేష్ జోషి కుమారుడిపై అత్యాచార ఆరోపణలు చేసిన 23 ఏళ్ల యువతిపై ఢిల్లీలో కొంతమంది దుండగులు సిరా దాడి చేశారు. సిరాను ఆమె మొహంపై వేసి పారిపోయారు. ఈ ఘటనపై పోలీసుల విచారణ ప్రారంభించారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఆగ్నేయ జిల్లా) ఈషా పాండే మాట్లాడుతూ.. శనివారం రాత్రి కొందరు దుండగులు యువతిపై ఏదో విసిరి పారిపోయారని తమకు కాల్ వచ్చిందని చెప్పారు. దాడి జరిగిన వెంటనే మహిళను ఎయిమ్స్ ట్రామా సెంటర్ కు తరలించారు.
శనివారం రాత్రి 9.30 గంటలకు కాళింది కుంజ్ రోడ్డ సమీపంలో తన తల్లితో కలిసి నడుచుకుంటూ వస్తున్న బాధితురాలిపై ఇద్దరు వ్యక్తులు ఇంక్ విసిరి పారిపోయారు. ఆమె ఫిర్యాదు ప్రకారం ఐపీసీ 195 A (ఎవరినైనా తప్పుడు సాక్ష్యం చెప్పమని బెదిరించడం), 506 (నేరపూరిత బెదిరింపులకు శిక్ష), 323 (స్వచ్ఛందంగా గాయపరిచినందుకు శిక్ష) మరియు 34 (అనేక వ్యక్తులు చేసిన చర్యలు) కింద షాహీన్ బాగ్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఈ ఘటనకు ముందు రాజస్తాన్ క్యాబినెట్ మంత్రి మహేష్ జోషి కుమారుడు రోహిత్ జోషిపై సదరు బాధిత యువతి సదర్ బజార్ పోలీస్ స్టేషన్ లో అత్యాచారం కేసు పెట్టింది. 2020లో ఫేస్ బుక్ ద్వారా రోహిత్ జోషి తనతో పరిచయం పెంచుకున్నాడని.. ఆమె ఆరోపించింది. జనవరి 8, 2021లో సవాయ్ మాధోపూర్ కు తీసుకెళ్లి, మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి తనపై తన ప్రమేయం లేకుండా అత్యాచారం చేశాడని ఆరోపిస్తోంది.
ఇదిలా ఉంటే ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషనర్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ నివేదిక కోరారు. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన కుమారుడిని కాపాడటానికి ప్రయత్నించ వద్దని ఆమె కోరారు. బాధిత యువతికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సిరాతో దాడి చేయడం, ఆమెను బెదిరిండంపై మహిళా కమిషన్ ఢిల్లీ పోలీసుల నుంచి నివేదిక కోరింది.