IndiGo: త్రివేండ్రం నుంచి బెంగళూర్ వెళ్తున్న ఇండిగో విమానంలో 5 ఏళ్ల చిన్నారి బంగారు గొలుసు కనిపించకుండా పోయింది. అయితే, ఇండిగో విమాన సిబ్బంది దొంగలించిందని ఆమె తల్లి ఆరోపించింది. ఇండిగో ఎయిర్ హోస్టెస్ దొంగిలించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏప్రిల్ 1న విమానం గాలిలో ఉండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
Read Also: Amit Shah: మార్చి 2026 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తాం..
తన ఇద్దరు కుమార్తెలతో ప్రయాణిస్తున్న ప్రియాంకా ముఖర్జీ ఈ ఫిర్యాదు దాఖలు చేశారు. తన కుమార్తెలలో ఒకరు ఫ్లైట్‌లో ఆందోళన చెంది ఏడవడం ప్రారంభించారని, ఒక మహిళా క్యాబిన్ సిబ్బందికి ఆమెను అప్పగించినట్లు ముఖర్జీ చెప్పారు. బిడ్డను తనకు తిరిగి అప్పగించే సమయంలో బంగారు హారం కనిపించలేదని చెప్పింది. మహిళా క్యాబిన్ సిబ్బందిని అదితి అశ్విని శర్మగా గుర్తించారు. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై విచారణ జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ సంఘటన గురించి తమకు తెలుసని, ఇలాంటి విషయాలు తీవ్రంగా పరిగణిస్తామని, సంబంధిత అధికారులకు పూర్తి మద్దతు, సహాకారం అందిస్తున్నట్లు ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. చిన్నారి తల్లి తన ఫిర్యాదులో.. మహిళా క్యాబిన్ సిబ్బంది తన బిడ్డను వాష్‌రూం వైపు తీసుకెళ్లిందని, ఆ తర్వాత చిన్నారి ధరించిన బంగారు గొలుసు కనిపించలేదని తెలిపింది. 20 గ్రాములు బంగారు గొలుసు ధర రూ. 80,000 ఉంటుందని ఫిర్యాదులో ముఖర్జీ పేర్కొన్నారు.