Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌ని ఉద్దేశించి పాకిస్తాన్-చైనాలు చేసిన సంయుక్త ప్రకటనను భారత్ తీవ్రంగా తప్పుపట్టింది. లడఖ్‌తో సహా కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ భారత్‌లో అవిభాజిత భాగాలని, విడదీయరాని ప్రాంతమని ఘాటుగా స్పందించింది. చైనా-పాక్ సంయుక్త ప్రకటన అనవసర సూచనలుగా భారత్ విమర్శించింది. పాక్ ప్రధాని షెహబాష్ షరీఫ్ జూన్ 4 నుంచి 8 వరకు చైనాలో పర్యటించారు. చైనా ప్రెసిడెంట్ జి జిన్‌పింగ్‌తో సమావేశమైన తర్వాత భారత్ ప్రతిస్పందన వచ్చింది. ఈ భేటీలో పాక్, చైనాలు డ్రీమ్ ప్రాజెక్ట్ చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) గురించి కూడా చర్చించాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న రోడ్డు, ఇతర కార్యకలాపాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) నుంచి వెళ్తుండటాన్ని భారత్ తీవ్రంగా తప్పుబడుతోంది.
జూన్ 7న పాక్-చైనాలు జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్ తాజా పరిణామాలను పాకిస్తాన్ చైనాకు వివరించిందని, జమ్మూ కాశ్మీర్ వివాదం చరిత్రలో మిగిలిపోయిందని, యూఎన్ చార్టర్‌కి అనుగుణంగా శాంతియుతంగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సంయుక్త ప్రకటన చేశాయి. అయితే, దీనిని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది.
Read Also: Ajit Doval: మూడోసారి జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్.. పదవీకాలం పొడిగిస్తూ ఉత్తర్వులు
‘‘జూన్ 7 నాటి చైనా మరియు పాకిస్తాన్‌ల మధ్య సంయుక్త ప్రకటనలో జమ్మూ మరియు కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంపై అనవసరమైన సూచనలను మేము గుర్తించాము. మేము అటువంటి సూచనలను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నాము. ఈ సమస్యపై మా వైఖరి స్థిరంగా ఉంది మరియు సంబంధిత పార్టీలకు బాగా తెలుసు’’ అని విదేశీ వ్యవహారాల (ఎంఈఏ) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ మరియు కాశ్మీర్ మరియు లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం భారతదేశంలోని అంతర్భాగాలు మరియు విడదీయరాని భాగాలుగా ఉన్నాయి, అలాగే ఉంటాయి. మరే ఇతర దేశానికీ దీనిపై వ్యాఖ్యానించే అధికారం లేదని అన్నారు.
పాకిస్తాన్‌లోని గ్వాదర్ పోర్టు, చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్సులను కలుపుతూ 3000 కి.మీ మేర 50 బిలియన్ డాలర్లతో సీపెక్ కారిడార్‌ని చైనా నిర్మిస్తోంది. ఇది భారత్‌లో అంతర్భాగంగా చెప్పబడుతున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్, గిల్గిట్ బాల్టిస్టాన్ గుండా వెళ్తోంది. ఇది తమ సార్వభౌమాత్వాన్ని ఉల్లంఘించడమే అని భారత్ చాలా సార్లు చెప్పింది.