PM Modi: రష్యాపై భారత వైఖరి స్పష్టంగా ఉందని, భారత వైఖరి ఏమిటో ప్రపంచానికి తెలుసు అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. అమెరికా పర్యటనకు వెళ్తున్న సమయంలో వాల్ స్ట్రీట్ జర్నల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశం శాంతికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన అన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో భారత్, రష్యా దేశానికి వ్యతిరేకంగా ఎందుకు ధృడమైన వైఖరి తీసుకోవడం లేదని అమెరికాలో వస్తున్న విమర్శలపై అడిగిన ప్రశ్నకు ప్రధాని స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మేము ఏ వైఖరి తీసుకోకుండా తటస్థంగా ఉందని అంటున్నారు, అయితే మేం తటస్థంగా లేము, మేం శాంతి పక్షాల ఉన్నామని మోడీ అన్నారు. అన్ని దేశాలు అంతర్జాతీయ చట్టాలు, దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించాలి, వివాదాలను చర్చలు, దౌత్య ప్రక్రియ ద్వారా పరిష్కరించుకోవాలని మోడీ స్పష్టం చేశారు.
Read Also: PM Modi: చైనాతో సంబంధాలకు సరిహద్దుల్లో శాంతి అవసరం
భారత్-అమెరికా భాగస్వామ్యంపై మోడీ మాట్లాడుతూ..రెండు దేశాల మధ్య అపూర్వమైన నమ్మకం ఉందని, రెండు దేశాల మధ్య పెరుగుతున్న రక్షణ సహకారం, తమ భాగస్వామ్యానికి మూలస్తంభం అని, ఇది వాణిజ్యం, సాంకేతికత, శక్తికి కూడా విస్తరిస్తుందని ఆయన అన్నారు. వేలాది ఏళ్లుగా భారత్ అనేక మతాలు, విశ్వాసాలకు కేంద్రంగా ఉందని ఆయన అన్నారు.
మోడీ అమెరికా పర్యటన యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. రెండు దేశాల మధ్య బంధం మరింతగా బలపడుతుందని ఇరు దేశాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా రక్షణ, సాంకేతికత రంగాల్లో ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదరనున్నాయి. ఇప్పటికే భారత్ ప్రిడిటర్ డ్రోన్ల కొనుగోలు ఒప్పందానికి పచ్చ జెండా ఊపిన సంగతి తెలిసిందే. జూన్ 21 నుంచి 23 వరకు జరిగే అమెరికా పర్యటనలో ప్రధాని పలు సంస్థల సీఈఓలు, పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ కానున్నారు. ప్రపంచ కుబేరుడు, టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ తో ప్రధాని మోడీ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.