Government data: భారతీయులపై చేసిన సర్వేలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆహారంపై తక్కువగా ఖర్చు చేస్తున్నారని, ముఖ్యంగా బియ్యం, గోధుమల వంటి ప్రధానమైన వస్తువులపై తక్కువ ఖర్చు చేస్తున్నట్లు తేలింది. ప్రాసెస్ చేసిన ఆహారం, టెలివిజన్లు, ఫ్రిజ్‌ల వంటి మన్నికైన వస్తువులపై ఎక్కువ ఖర్చు చేస్తున్నారని ప్రభుత్వ వినియోగ డేటా వెల్లడించింది. 11 ఏళ్ల తర్వాత కేంద్రం కీలకమైన వినియోగ వ్యయ సర్వే డేటాను వెల్లడించింది.
శనివారం విడుదల చేసిన గృహ వినియోగ వ్యయ సర్వేలో.. 2011-12 సర్వేతో ఒక గ్రామీణ వినియోగదారుడు నెలకు రూ. 1430 ఖర్చు చేస్తే, 2022-23లో అది రూ. 3773కి పెరిగినట్లు అంచనా వేసింది. పట్టణ వ్యయం ఒక్కో వ్యక్తికి రూ. 2630 నుంచి రూ. 6459కి పెరిగింది. 2011-12లో గ్రామీణ వినియోగదారులకు నెలవారీ వినియోగంలో ఆహారంపై ఖర్చు దాదాపు 53 శాతం నుంచి 46 శాతానికి తగ్గింది. ఇది పట్టణ ప్రాంతాల్లో 43 శాతం నుంచి 39 శాతానికి పడిపోయింది. భారతీయులు గోధుమలు, బియ్యం, పప్పులతో సహా తృణధాన్యాలపై తక్కువ ఖర్చు చేస్తున్నారు. కానీ పానీయాలు, రిఫ్రెష్‌మెంట్, ప్రాసెస్ ఫుడ్‌పై ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. ఆహారేతర వస్తువులలో మన్నికైన వస్తువులైన టెలివిజన్, ఫ్రిజ్‌లపై ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు.
Read Also: Honour killing: వేరే కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు వ్యక్తి దారుణహత్య..
సుమారు 11 ఏళ్ల తర్వాత మొదటిసారిగా, ఆగస్టు 2022-జూలై 2023 మధ్య అఖిల భారత గృహ వినియోగ వ్యయ సర్వేను తాజాగా విడుదల చేసింది. స్థూల దేశీయోత్పత్తి (GDP), పేదరిక స్థాయిలు మరియు వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం (CPI) వంటి కీలకమైన ఆర్థిక సూచికలను సమీక్షించడంలో ఈ డేటా కీలక పాత్ర పోషిస్తుంది. గృహ వినియోగ వ్యయ సర్వే (HCES) సాధారణంగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO)చే నిర్వహించబడుతుంది. అయితే, డేటా నాణ్యత సమస్య వల్ల 2017-18 సర్వే ఫలితాలను కేంద్ర విడుదల చేయలేదు. తాజా సర్వే ప్రకారం, భారతీయ కుటుంబాలలో సగటు నెలవారీ తలసరి వినియోగ వ్యయం (MPCE) పట్టణ గృహాల్లో 2011-12 నుండి 33.5% పెరిగి రూ. 3,510కి చేరుకుంది, గ్రామీణ భారతదేశంలోని MPCE అదే కాలంలో 40.42% వృద్ధితో రూ. 2,008కి పెరిగింది.