USA: “నువ్వు ముస్లింవా?” అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..

  • అమెరికాలో భారతీయుడిపై కత్తిదాడి..
  • ముస్లింవా? అని ప్రశ్నించి దాడికి పాల్పడ్డ అమెరికన్..
  • విషమ పరిస్థితుల్లో ఉన్న బాధితుడు సోహైల్..
Usa Stabbing

Usa Stabbing

USA: అమెరికాలో భారతీయుడిపై జాతి విద్వేష దాడి జరిగింది. ఉటా రాష్ట్రంలో ఓ భారతీయుడిని మతం అడిగి కత్తితో దాడి చేయడం కలకలం రేపింది. భారత్‌కు చెందిన సోహైల్ అనే వ్యక్తిని ‘‘నువ్వు ముస్లింవా?’’ అని అడిగి 15 సార్లు ఓ అమెరికన్ కత్తితో పొడిచాడు. ఈ ఘటన షాపింగ్ మాల్‌లో చోటుచేసుకుంది. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. 48 ఏళ్ల పీటర్ మైఖేల్ లార్సెన్ అనే వ్యక్తి సోమవారం వెస్ట్ వ్యాలీ సిటీలోని వ్యాలీ ఫెయిర్ మాల్‌లో సోహైల్‌పై దాడికి పాల్పడ్డాడు.

ముందుగా మాల్‌లో సోహైల్‌తో మాట్లాడటం ప్రారంభించిన మైఖేల్ మాట్లాడటం ప్రారంభించాడు. ముందుగా మీరు ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించాడు. అందుకు సోహైల్ తాను భారత్ నుంచి వచ్చినట్లు చెప్పాడు. ఆ తర్వాత నువ్వు ముస్లింవా? అని ప్రశ్నించాడు. అందుకు అవును అని సమాధానం చెప్పగానే, మైఖేల్ తన వద్ద ఉన్న కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ‘‘ముస్లింలను చంపాలనే ఈ దాడి చేశాను’’ అని నిందితుడు విచారణలో అంగీకరించినట్లు కోర్టు పత్రాల్లో పేర్కొన్నారు. దీంతో అతడిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

సోహైల్‌కు 15 కత్తిపోటు గాయాలు ఏర్పడ్డాయి. ఆయనకు పలుమార్లు సర్జరీలు నిర్వహించారు. ప్రస్తుతం, అతడు పరిస్థితి విషమంగా ఉందని వైద్యలు చెబుతున్నారు. దాడి తర్వాత పోలీసులు చేరుకునే లోపే స్థానికులు దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. సోహైల్‌కు కుటుంబంలో ఆయన ఒక్కరే సంపాదిసోతున్నారు. సోహైల్‌కు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఈ కుటుంబానికి సహాయం చేయడానికి సహోద్యోగులు విరాళాలు సేకరించడం ప్రారంభించారు.