Tariff on US Goods: అమెరికా 25 శాతం వేస్తే.. భారత్ కూడా అదే చేయాలి! ప్రధాని మోదీకి వ్యాపారుల లేఖ

  • భారత్‌పై 25 శాతం సుంకాలకు యూఎస్ ప్రతిపాదన..
  • అమెరికాపై కూడా ప్రతీకార సుంకాలు విధించాలని మోడీకి CTI లేఖ..
Trump Modi

Trump Modi

Tariff on US Goods: భారత్‌తో సహా పలు దేశాలపై సుంకాలు వేయాలని అమెరికా ప్రతిపాదించింది. భారత్‌పై 25 శాతం, చైనాపై 40 శాతం సుంకాలను వేయాలని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. అయితే, భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరితే 17 శాతం మాత్రమే సుంకాలు విధిస్తామని, ఒప్పందం కుదరకపోతే 25 శాతం సుంకాలు విధిస్తామని అమెరికా చెబుతోంది.

ఇదిలా ఉంటే, భారత్ వస్తువులపై అమెరికా సుంకాలు విధిస్తే, అమెరికా దిగుమతులపై 25 శాతం ప్రతీకార సుంకాలు విధించాలని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరింది . అమెరికా సుంకాల వల్ల 48 బిలియన్ డాలర్ల ఎగుముతులపై ప్రభావం పడొచ్చని, 5 లక్షల మంది ఉద్యోగాలు ప్రమాదంలోకి వెళ్లొచ్చని CTI హెచ్చరించింది.

అమెరికా ఏకపక్ష చర్యలపై ప్రతీకార చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాస్తున్నట్లు సీటీఐ ఛైర్మన్ బ్రిజేష్ గోయల్ గురువారం తెలిపారు. అమెరికా నుంచి భారత్‌కు ఆహార ఉత్పత్తులు, పానీయాలు, ఖనిజాలు, పప్పు ధాన్యాలు పెద్ద ఎత్తున దిగుమతి అవుతున్నాయి. వీటిపై భారత్ 25 శాతం సుంకాలు విధిస్తే దేశంలో అమెరికా ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని, తద్వారా నష్టపోయే అమెరికా వ్యాపారులు వారి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారని గోయల్ వివరించారు.

అమెరికా సుంకాల వల్ల భారత్ ఉత్పత్తులైన వస్త్రాలు, ఫార్మాస్యూటికల్స్, వైద్య పరికరాలు, ఎలక్ట్రానిక్స్, సీఫుడ్, రత్నాలు-ఆభరణాలు, తోలు, లోహాలు, ఆటో విడిభాగాల రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. సుంకాల వల్ల అమెరికన్ మార్కెట్‌లో భారత వస్తువులకు ధరలు పెరిగితే, వాటికి బదులుగా వేరే దేశాలకు చెందిన వస్తువుల్ని అమెరికన్ ప్రజలు కొనుగోలు చేస్తారు. దీని వల్ల భారత ఉత్పత్తి, వ్యాపారులపై ప్రభావం పడుతుంది.