Working Age Population: భారతదేశానికి ఒక విధంగా చెప్పాలంటే ఇది గుడ్ న్యూస్. దేశంలో 2045 నాటికి కనీసం 17.9 కోట్ల మంది శ్రామిక వయసు కలిగిన జనాభా చేరుతుందని అంచనా వేయబడింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు, ఆర్థిక వృద్ధికి కీలకంగా మారనుంది. మరోవైపు ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో శ్రామిక జనాభా తగ్గుతుంది. చైనాతో పాటు ఇతర దేశాలు కూడా ఇదే సమస్యని ఎదుర్కొంటున్న తరుణంలో భారత్‌కి సానుకూలమైన సంకేతంగా ఉండబోతోంది. ప్రస్తుతం దేశంలో దాదాపుగా 96.1 కోట్ల శ్రామిక జనాభా ఉంది. నిరుద్యోగం రేటు ఐదేళ్ల కనిష్ట స్థాయికి చేరుకుంది.
Read Also: Megha Akash: ప్రియుడిని పెళ్లాడిన టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోలు వైరల్
గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ జెఫరీస్ మాట్లాడుతూ భారతదేశంలో పని చేసే వారి సంఖ్య (25 నుండి 64 సంవత్సరాల వయస్సు) పెరుగుతోందని మరియు మొత్తం జనాభాలో ఎక్కువ భాగం పొదుపు మరియు పెట్టుబడుల పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పారు. శ్రామిక ప్రజల్లో మహిళల సంఖ్య కూడా పెరుగుతోందని, ఇది కార్మిక శక్తి పెరుగుదల ముఖ్యమైన కారణమని నివేదిక పేర్కొంది. ఇదిలా ఉంటే దేశంలో శ్రామిక ప్రజల సంఖ్య పెరుగుదల మందగమనం 2030 నుంచి ప్రారంభమవుతుందని జెఫరీస్ తెలిపింది. 2030 నాటికి లేబర్ ఫోర్స్ నుంచి అదనంగా 6 మిలియన్ల మంది తగ్గుతారని చెప్పింది. వ్యవసాయ ఉద్యోగాల నుంచి మారడం ద్వారా ఈ ఖాళీని భర్తీ చేయాలని సూచించింది.
ఆగస్ట్‌లో గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, భారతదేశంలో 15 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో కార్మిక శక్తి భాగస్వామ్య రేటు (LFPR) 2024 ఏప్రిల్-జూన్‌లో 50.1 శాతానికి పెరిగింది, ఇది ఏప్రిల్-జూన్ 2023లో 48.8 శాతంగా ఉంది. దేశంలో ఉపాధి పెరగడం ద్వారా ఇది సాధ్యమైంది. 15 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళల్లో LFPR రేటు ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి జూన్ వరకు 25.2 శాతానికి పెరిగింది, ఇది 2023 అదే కాలంలో 23.2 శాతంగా ఉంది. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం గత పదేళ్లలో దేశంలో దాదాపు 17 కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చాయి. 2023-24లో దేశంలో 64.33 కోట్ల మందికి ఉపాధి లభించింది. 2014-15లో ఈ సంఖ్య 47.15 కోట్లుగా ఉంది.