US-India-Russia: చమురు విషయంలో రష్యా హామీ.. అమెరికా ముందు భారత్ కీలక డిమాండ్..

Oil Crisis

Oil Crisis

US-India-Russia: ఇరాన్ వార్, హార్ముజ్ సంక్షోభం నేపథ్యంలో భారత్ తీవ్ర చమురు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో భారత ఇంధన భద్రతకు హామీ ఇస్తూ, గ్యాస్, చమురు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రష్యా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రష్యా చమురు కొనుగోళ్లపై మినహాయింపు ఇవ్వాలని అమెరికాను భారత్ కోరినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన సరఫరా కొనసాగించడం అత్యంత కీలకమైని, చమురు మార్కెట్‌లో అస్థిరత కొనసాగితే ఇది భారత ఆర్థిక వ్యవస్థ, ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని భారత్, అమెరికాకు తెలిపింది.

ఇరాన్ యుద్ధం తర్వాత, భారత్‌తో సహా ఇతర దేశాలు రష్యా చమురు కొనుగోలు చేసేందుకు మార్చిలో అమెరికా అనుమతినిచ్చింది. ఈ మినహాయింపును మే 16 వరకు పొడిగించారు. ఈ మినహాయింపుల వల్ల భారత్ రష్యా నుంచి ముడి చమురును రాయితీపై కొనుగోలు చేసింది. అయితే, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాపై ఒత్తిడి తీసుకురావడానికి భారత్ రష్యా చమురు కొనుగోలు చేయొద్దని అమెరికా ఒత్తిడి తెస్తోంది. ఇప్పుడు ఇరాన్ యుద్ధం కారణంగా, చమురు కష్టాలు మరింత ఎక్కువయ్యాయి.

Read Also: Emmanuel Macron: నటి మెసేజ్‌లే కారణమా..? ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్‌కు భార్య చెంపదెబ్బ!

ఎకనామిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం.. చమురు మార్కెట్లలో అస్థిరత, సంక్షోభం కొనసాగితే ఇది సామాజిక ఆర్థిక పరిణామాలకు దారితీయెచ్చని భారత అధికారులు అమెరికాకు తెలిపారు. ఈ విషయంపై భారత విదేశాంగ శాఖ, చమురు మంత్రిత్వ శాఖలు స్పందించలేదు. అటు అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ నుంచి కూడా అధికారిక స్పందన రాలేదు.

మరోవైపు, న్యూఢిల్లీలో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ వచ్చే ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ఇంధన ప్రయోజనాలు పూర్తిగా రక్షించబడేలా రష్యా హామీ ఇస్తుందని ఆయన అన్నారు. భారత ప్రయోజనాలకు భంగం కలుగకుండా ఇంధన సరఫరా చేస్తామని అన్నారు. ఇంధన రంగంలో భారత్, ఇతర భాగస్వామ్య దేశాల పట్ల రష్యా తన బాధ్యతను ఎన్నడూ మరిచి లేదని చెప్పారు. భారతదేశానికి మరింత ఇంధనం అవసరమని, రష్యా గ్యాస్, చమురు, బొగ్గు వంటి హైడ్రోకార్బన్లను నిరంతరం సరఫరా చేస్తుంది అని ఆయన అన్నారు.