India on Saudi’s police clearance exemption for visa: భారతీయులకు సౌదీ అరేబియా గుడ్ న్యూస్ చెప్పింది. సౌదీకి వెళ్లాలనుకునే భారతీయులకు వారికి వీసా నిబంధనల్లో సడలింపులు ఇచ్చింది. వీసా పొందేందుకు ఇకపై పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ (పీసీసీ) సమర్పించే అవసరం లేకుండా భారతీయ పౌరులకు మినహాయింపు ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని సౌదీలోని భారతీయ మిషన్ గురువారం స్వాగతించింది. సౌదీ అరేబియాలో నివసిస్తున్న 20 లక్షల మంది భారతీయులకు ఈ మినహాయింపులు ఉపశమనం కలిగిస్తుందని రాయబార కార్యాలయం తెలిపింది.
Read Also: IND Vs NZ: నేడు న్యూజిలాండ్‌తో తొలి టీ20.. మరోసారి సూపర్ ఓవర్లు జరుగుతాయా?
‘‘ భారత రాయబార కార్యాలయం ఈ ప్రకటనను స్వాగతించింది. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ సమర్పణ నుంచి భారతీయ పౌరులను మినహాయిస్తూ నిర్ణయం తీసుకున్నందుకు సౌదీ అరేబియా ప్రభుత్వానికి ధన్యవాదాలు. 2 మిలియన్ల భారతీయ సమాజానికి ఇది ఉపశమనం కల్పిస్తుంది’’ అని సౌదీలోని భారత మిషన్ ట్వీట్ చేసింది. ఉద్యోగం, దీర్ఘకాలిక వీసా కోసం విదేశాలకు వెళ్లడానికి భారతీయ పౌరులు వీసాకు అవసరమైన పత్రాలతో పాటు పీసీసీని సమర్పిస్తారు. పౌరుడి నేర చరిత్ర వివరించడానికి పోలీస్ క్లీయరెన్స్ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది.
తాజాగా ఈ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ మినహాయించడం ద్వారా ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ఇటీవల కాలంలో సౌదీ అరేబియా, ఇండియాల మధ్య వాణిజ్యం, వ్యాపారం పెరుగుతోంది. ఇంధనం, భద్రత, వాణిజ్యం, పెట్టుబడి, ఆరోగ్యం, ఆహార భద్రత, సాంస్కృతిక, రక్షణ రంగాల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. భారత్ లో సౌదీ పెట్టుబడులు కూడా పెరిగాయి.