Bullet Trains: హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటించిన కేంద్రం

  • హైదరాబాదీలకు గుడ్‌న్యూస్
  • బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటించిన కేంద్రం
  • తగ్గనున్న ప్రయాణ సమయాలు
Bullettrains

Bullettrains

భారతదేశంలో రైల్వే వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం వందే భారత్ రైళ్లు వేగంగా దూసుకుపోతున్నాయి. ఇప్పుడు అంతకంటే వేగంగా దూసుకుపోయే బుల్లెట్ ట్రైన్లు కూడా భారత్‌లో పరిగెత్తబోతున్నాయి. ఇందుకు సంబంధించిన కారిడార్లను కేంద్ర రైల్వే శాఖ వెల్లడించింది. 7 కొత్త బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటించింది.

దేశవ్యాప్తంగా ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ కారిడార్ల కోసం ‘బీ35 (B35)’ పేరుతో అత్యాధునిక హైస్పీడ్ రైళ్లను అభివృద్ధి చేయాలని నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) నిర్ణయించింది. ఈ రైళ్ల రూపకల్పన, తయారీ కోసం సంస్థలు ఎంపిక చేసే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. భారత్‌లోనే తయారు కానున్న ఈ B35 బుల్లెట్ ట్రైన్లు గరిష్టంగా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించనున్నారు. సాధారణ సేవల్లో గంటకు 320 కిలోమీటర్ల వేగంతో నడిచేలా ప్రణాళిక సిద్ధం చేశారు. భవిష్యత్తులో దేశంలోని అన్ని కొత్త బుల్లెట్ ట్రైన్ మార్గాల్లో ఇవే ప్రధాన హైస్పీడ్ రైళ్లుగా మారనున్నాయి.

7 కొత్త బుల్లెట్ ట్రైన్ కారిడార్లు

NHSRCL ప్రతిపాదనల ప్రకారం B35 రైళ్లు ఈ క్రింది హైస్పీడ్ మార్గాల్లో నడిచే అవకాశం ఉంది.

ముంబై – పుణె
పుణె – హైదరాబాద్
హైదరాబాద్ – బెంగళూరు
హైదరాబాద్ – చెన్నై
చెన్నై – బెంగళూరు
ఢిల్లీ – వారణాసి
వారణాసి – సిలిగురి

భారీగా తగ్గనున్న ప్రయాణ సమయం


ఈ బుల్లెట్ ట్రైన్ కారిడార్లు అందుబాటులోకి వస్తే ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.

ముంబై – అహ్మదాబాద్: 1 గంట 57 నిమిషాలు
ముంబై – పుణె: 48 నిమిషాలు
బెంగళూరు – చెన్నై: 73 నిమిషాలు
బెంగళూరు – హైదరాబాద్: 2 గంటల 10 నిమిషాలు
పుణె – హైదరాబాద్: 2 గంటల 8 నిమిషాలు
ఢిల్లీ – లక్నో: 2 గంటలు
ఢిల్లీ – వారణాసి: 3 గంటల 15 నిమిషాలు

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ పనులు వేగంగా

ఇక దేశంలోని తొలి 508 కిలోమీటర్ల ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా గుజరాత్‌లోని సూరత్-వాపి మధ్య 97 కిలోమీటర్ల విభాగంలో 2027 ఆగస్టు నాటికి బుల్లెట్ ట్రైన్ సేవలు ప్రారంభించాలని NHSRCL లక్ష్యంగా పెట్టుకుంది. B35 బుల్లెట్ ట్రైన్ల అభివృద్ధితో భారత్‌లోనే అత్యాధునిక హైస్పీడ్ రైళ్ల తయారీకి ఊతం లభించనుంది. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ కారిడార్లలో వేగవంతమైన, స్వదేశీ సాంకేతికతతో రూపొందిన రైలు సేవలు అందుబాటులోకి రావడంతో రవాణా రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది.