Khalistani Terrorists: భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న పంజాబ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ పవిత్తర్ సింగ్ బటాలాను, మరో ఏడుగురు ఖలిస్తాన్ ఉగ్రవాదులను అమెరికాలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) కిడ్నాప్ కేసులో అరెస్టు చేసింది. బటాలా నిషేధిత ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌తో సంబంధాలను కలిగి ఉన్నాడు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు భారతదేశం ఇతడిని కోరుతోంది.
Read Also: Air India Crash: ఎయిర్ ఇండియా క్రాష్ రిపోర్టుపై పైలట్ల సందేహాలు..
శాన్ జోక్విన్ కౌంటీలో కిడ్నాప్, హింసకు సంబంధించిన కేసులో శుక్రవారం అమెరికాలోని వివిధ ప్రాంతాల నుండి అరెస్టులు జరిగినట్లు అక్కడి షెరీఫ్ కార్యాలయం తెలిపింది. జూలై 11,2025న ఈ ఘటన జరిగినట్లు వెల్లడించింది. బటాలాతో పాటు, ఇతర అనుమానితులను దిల్‌ప్రీత్ సింగ్, అమృత్‌పాల్ సింగ్, అర్ష్‌ప్రీత్ సింగ్, మన్‌ప్రీత్ రంధావా, సరబ్‌జిత్ సింగ్, గుర్తాజ్ సింగ్, విశాల్ అనే వ్యక్తిలను ఎఫ్‌బీఐ అరెస్ట్ చేసింది.
నిందితులందరిపై కిడ్నాప్, హింస, తప్పుడు నిర్బంధం, సాక్షిని బెదిరించడం, సెమీ ఆటోమేటిక్ తుపాకీతో దాడి చేయడం, క్రిమినల్ బెదిరింపులు చేయడం వంటి అనేక అభియోగాలపై కేసు నమోదు చేసి శాన్ జోక్విన్ కౌంటీ జైలుకు పంపారు. ఇటీవల కాలంలో, గోల్డీ బ్రార్, అన్మోల్ బిష్ణోయ్, రోహిత్ గొదారాతో సహా భారత్‌లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నట్లు అనేక మంది ఉగ్రవాదులు, గ్యాంగ్‌స్టర్లు చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకోవడానికి యూఎస్, కెనడాలను తమ రహస్య స్థావరంగా మార్చుకున్నారు.