India at UN: పాకిస్తాన్ తీరు మారడం లేదు. కుక్క తోక వంకర అనేలా ప్రపంచవేదికలపై భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటోంది. మరోసారి ఐక్యరాజ్యసమితి వేదికగా జమ్మూ కాశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ లేవనెత్తింది. అయితే, భారత్ అంతే ధీటుగా పాకిస్తాన్ తీరును ఎండగట్టింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో భారత్ ధీటుగా పాకిస్తాన్‌కి కౌంటర్ ఇచ్చింది. భారతదేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడానికి పాకిస్తాన్‌కి ఎలాంటి అధికారం లేదని చెప్పింది.
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి 55వ రెగ్యులర్ సెషన్లో, జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమని మరియు విడదీయరాని భాగమని భారతదేశ ఫస్ట్ సెక్రటరీ అనుపమా సింగ్ అన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ పాకిస్తాన్ వేదికను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. పాకిస్తాన్లో మానవ హక్కులు అధ్వాన్నంగా ఉన్నాయని, 2023 ఆగస్టు, జరన్‌వాల నగరంలో క్రిస్టియన్లకు వ్యతిరేకంగా 19 చర్చిలను ధ్వంసం చేయడం, 89 క్రైస్తవ గృహాలను తగలబెట్టడాన్ని భారత్, పాకిస్తాన్‌కి గుర్తు చేసింది. తన సొంత మైనారిటీలపై పాకిస్తాన్ హింసకు పాల్పడుతోందని భారత్ ధ్వజమెత్తింది. ఆర్థిక పురోగతి, సామాజిక న్యాయాన్ని సాధిస్తున్న భారత్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పాకిస్తాన్ వక్రబుద్ధికి నిదర్శనమని భారత్ మండిపడింది.
ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, తీవ్రవాదం, అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాక్, అక్కడి ప్రజల ప్రయోజనాలను నెరవేర్చడంలో విఫలమైందని భారత్ చెప్పింది. ఫిబ్రవరి 26న ప్రారంభమైన కొనసాగుతున్న యుఎన్‌హెచ్‌ఆర్‌సి సెషన్ ఏప్రిల్ 5 వరకు కొనసాగుతుంది. గతేడాది ఆగస్టులో జరిగిన సమావేశాల్లో ఉగ్రవాదం లేని పాకిస్తాన్‌తోనే సాధారణ సంబంధాలు కొనసాగుతాయని భారత్ స్పష్టం చేసింది.