1993 Train blasts: 1993 రైలు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న లష్కర్ తోయిబా ఉగ్ర సంస్థ బాంబు తయారీదారు అబ్దుల్ కరీం తుండాను రాజస్థాన్ ప్రత్యేక కోర్టు నేడు నిర్దోషిగా ప్రకటించింది. 1992 బాబ్రీ మసీదు కూల్చివేత గడిచి సంవత్సరం పూర్తి అయిన సందర్భంలో పలు రైళ్లలో పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో ఇద్దరు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. అయితే, తుండాకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవని పేర్కొన్న కోర్టు, ఇద్దరు నిందితులు అమీనుద్దీన్, ఇర్ఫాన్‌లను దోషులుగా నిర్ధారించి వారికి జీవిత ఖైదు విధించింది.
ప్రస్తుతం 80 ఏళ్ల తుండా 1996 బాంబు పేలుళ్ల కేసులో దోషిగా తేలిన ఇతను జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. తుండా అనేక బాంబు పేలుళ్లలో నిందితుడిగా ఉన్నాడు. అండర్ వరల్డ్ డాన్, ముంబై వరస పేలుళ్ల నిందితుడు దావూద్ ఇబ్రహీంకి సన్నిహితుడిగా పేరున్న తుండా బాంబు తయారీలో నిష్ణాతుడు. ఇతడిని ‘‘డాక్టర్ బాంబ్’’ అని పిలిచేవారు.
Read Also: Lishi Missing: మా చెల్లి మిస్సింగ్.. పోలీసులకు హీరోయిన్ ఫిర్యాదు
1993లో కోట, కాన్పూర్, సికింద్రాబాద్, సూరత్ మీదుగా వెళ్లే రైళ్లలో పేలుళ్లు జరిగాయి. బాంబే పేలుళ్లు జరిగిన నెల రోజుల తర్వాత రైలు బాంబు పేలుళ్లతో దేశం మరోసారి ఉలిక్కిపడింది. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేసింది. అయితే, తాజాగా తుండాను నిర్దోషిగా ప్రకటించడంతో సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని సమాచారం.
తుండా తన 40 ఏట ఉగ్రవాదం వైపు మళ్లాడు. 1993 ముంబై వరస పేలుళ్ల తర్వాత అతను నిఘా వర్గాల స్కానర్ కిందకు వచ్చాడు. బాంబుల తయారీలో ఎక్స్‌ఫర్ట్ అయిన అతను, బాంబు తయారు చేస్తుండగా పేలుడు సంభవించడంతో ఎడమ చేతిని కోల్పోయాడు. లష్కరే తోయిబా, ఇండియన్ ముజాహిదీన్, జైష్-ఎ-మహ్మద్ మరియు బబ్బర్ ఖల్సాతో సహా పలు ఉగ్రవాద సంస్థలతో కలిసి పనిచేశాడు. 2013లో భారత్- నేపాల్ సరిహద్దు సమీపంలోని ఉత్తరాఖండ్ బన్‌బసాలో అరెస్టయ్యాడు. నాలుగేళ్ల తర్వాత, 1996లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో హర్యానా కోర్టు తుండాకు జీవితఖైదు విధించింది.