కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు భారత్ మరో ముందడుగు వేసింది. ఇప్పటి వరకు రెండు రకాల వ్యాక్సిన్లు ఇండియాలో అందుబాటులో ఉన్నాయి. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కు కూడా ఇండియా అనుమతులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు ఇండియాలో మరో వ్యాక్సిన్ కూడా రెడీ అయ్యింది. అయితే, ఇది అలోపతి కాదు, హోమియోపతి వ్యాక్సిన్. కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ప్రపంచంలోనే తొలిసారిగా ఇండియాలో హోమియోపతి వ్యాక్సిన్ తయారు చేసినట్టు లైఫ్ ఫోర్స్ హోమియోపతి అండ్ బయోసిమిలా అధిపతి డాక్టర్ రాజేష్ షా పేర్కొన్నారు. హోమియోపతి వ్యాక్సిన్ సోనోడ్ కరోనా లక్షణాలను తగ్గించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో 62శాతం ప్రభావం చూపినట్టు చెప్తున్నారు. మనిషిలో సహజంగా రోగనిరోధక శక్తిని పెంచుతూ, వ్యాధిలక్షలను తగ్గించేది టీకా అని, సోనోడ్ కూడా టీకానే అని అంటున్నారు తయారీదారులు. క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని, త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని హోమియో నిపుణులు చెప్తున్నారు. హోమియోటీకా అందుబాటులోకి వస్తే అందరికి టీకా ఇవ్వడం సాధ్యం అవుతుంది.