Site icon NTV Telugu

Covid Cases: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. మూడు డోసులకూ లొంగని ఆ వేరియంట్!

Corona

Corona

Corona Cases In India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే.. బుధవారం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 6,422 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. కరోనా మహమ్మారి బారిన పడి 34 మంది ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. యాక్టివ్​ కేసులు 0.10 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 46 వేల పైకి చేరుకుంది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 46,389కు చేరాయి.

దేశంలో కరోనా మొదలైనప్పటి నుంచి ఇండియాలో మొత్తం కేసుల సంఖ్య 4,45,16,479కి చేరుకుంది. దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,28,250గా ఉంది. ఇండియాలో 4,39,41,840 మంది వ్యాధి బారినుంచి కోలుకున్నారు. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 2.04 శాతంగా ఉంది. భారతదేశంలో కోవిడ్ మహమ్మారి ప్రారంభం అయినప్పటి నుంచి చూస్తే.. డిసెంబర్, 2020లో కోటి కేసులు నమోదు అవ్వగా.. ఈ సంఖ్య మే 4,2021 నాటికి రెండు కోట్లకు, జూన్ 23,2021 నాటికి మూడు కోట్లకు.. జవవరి 25, 2022 నాటికి నాలుగు కోట్ల మైలురాయిని చేరుకుంది.

ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా కొన్ని దేశాల్లో కోవిడ్ వ్యాధి విజృంభిస్తోంది. కొత్తగా 520,969 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో మరో 1,466 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 615,324,011కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో 65,22,896 మంది మరణించారు. మరో 640,356 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 5,94,344,187 కు చేరింది. దక్షిణ కొరియాలో కొత్తగా 93,904 కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 60 మంది ప్రాణాలు కోల్పోయారు.జపాన్‌లో కొత్తగా78,701కేసులు వెలుగుచూశాయి. మరో 191 మంది మరణించారు. జర్మనీలో46,514 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో 230 మంది మృతి చెందారు.తైవాన్​లో 49,708 కొవిడ్ కేసులు నమోదుకాగా, వైరస్ వల్ల 37 మంది ప్రాణాలు కోల్పోయారు.

Jammu Kashmir: శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

వ్యాక్సిన్‌లకు లొంగని వేరియంట్‌: కరోనా వేరియంట్ ఒమిక్రాన్‌ బీఏ.4.6 అనే కొత్త ఉపరకం అమెరికా, యూకేలలో విస్తరిస్తోంది. తమ దేశంలో సేకరించిన మొత్తం నమూనాల్లో 3.3 శాతం ఈ రకమే ఉన్నట్లు బ్రిటన్ ఆరోగ్య భద్రతా సంస్థ వెల్లడించింది. అది ఇప్పుడు 9 శాతానికి చేరింది. అమెరికాలో సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ సంస్థ సైతం దేశవ్యాప్తంగా 9శాతం కేసులు బిఎ.4.6 రకాలేనని తెలిపింది. కేవలం ఈ రెండు దేశాల్లోనే కాకుండా పలు దేశాల్లోనూ ఈ ఉపరకం కనిపిస్తోంది. బీఏ.4.6 కూడా బీఏ.4 లాంటిదేనని, అందులోని స్పైక్‌ ప్రోటీన్‌లో మ్యుటేషన్‌(ఉత్పరివర్తనం) ఉంటుందని శాస్త్రజ్ఞులు వెల్లడించారు. ఆర్‌346టీ అనే ఈ మ్యుటేషన్ కొన్ని ఇతర ఉపరకాల్లోనూ కనిపించింది. దానివల్ల, టీకా తీసుకున్నా.. లేదా అంతకుముందు వైరస్‌ సోకినా వచ్చే రోగనిరోధకశక్తి నుంచి ఇది తప్పించుకుంటుంది. ఒమిక్రాన్‌లోని ఇతర రకాల్లాగే దీనివల్ల కూడా వ్యాధి తీవ్రత, మరణాలు సంభవించే అవకాశాలు తక్కువ.

ముగింపు దశకు కొవిడ్: ప్రపంచాన్ని రెండు మూడేళ్లుగా వేధిస్తున్న కొవిడ్‌-19 ముగింపుదశకు చేరిందని, గత వారం ప్రపంచవ్యాప్తంగా నమోదైన కరోనా మరణాలు 2020 మార్చి నుంచి పోల్చితే కనిష్ఠ స్థాయిలో ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ఈ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ బుధవారం మీడియాతో మాట్లాడారు.శీతాకాలంలో మళ్లీ కేసుల సంఖ్య పెరిగి, కొత్త వేరియంట్లు పుట్టుకొస్తే ఇప్పటిదాకా సాధించిన పురోగతి వృథా అవుతుందని టెడ్రోస్‌ హెచ్చరించారు.

కొవిడ్ వల్ల వృద్ధులకు అల్జీమర్స్ ముప్పు!:  కొవిడ్ సోకిన వృద్ధులకు ఏడాదిలోగా అల్జీమర్స్ వచ్చే ముప్పు 50 నుంచి 80 శాతం అధికంగా ఉంటున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. కరోనా సోకిన చాలా మంది చాలామంది కాలక్రమంలో అల్జీమర్స్‌కు గురవుతుండటంపై కేస్‌ వెస్టర్న్‌ రిజర్వ్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. ఇందులో భాగంగా- 2020-21లో కొవిడ్‌ చికిత్స పొందిన 62 లక్షల మంది ఆరోగ్య వివరాలను విశ్లేషించారు. వీరంతా 65 ఏళ్లు పైబడినవారే. కరోనాకు, కేంద్ర నాడీ వ్యవస్థలోని అసాధారణ మార్పులకూ సంబంధమున్నట్లు గుర్తించినట్లు పరిశోధనకర్త పమేలా దవీస్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. అల్జీమర్స్‌ తలెత్తడానికి కరోనా ఎలా కారణమవుతోందన్నది ఇంకా తెలియలేదు. కానీ కొవిడ్ వల్ల అల్జీమర్స్ ముప్పు మాత్రం 80 శాతం అధికంగా ఉన్నట్లు తేలిందని దవిస్ తెలిపారు.

Exit mobile version