INDIA alliance: ఇండియా కూటమి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. బీజేపీ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా ఏర్పడిన ఈ కూటమి, ఇప్పుడు కీలక మిత్ర పక్షాలను కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. జూన్ 8న కీలకమైన ఇండియా కూటమి సమావేశం జరుగబోతోంది. అయితే, ఈ సమావేశానికి హాజరుకాబోమని ఇప్పటికే డీఎంకే తేల్చి చెప్పంది. ఇప్పుడు ఇదే బాటలో ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన యూబీటీ కూడా నడుస్తున్నట్లు తెలుస్తోంది.
తమిళనాడు ఎన్నికల తర్వాత డీఎంకే-కాంగ్రెస్ మధ్య విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. డీఎంకే కూటమితో పోటీ చేసిన కాంగ్రెస్, ఇప్పుడు విజయ్ పంచన చేరింది. కాంగ్రెస్‌కు ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు విజయ్ టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ, ప్రభుత్వంలో చేరారు. దీంతో డీఎంకే ఆగ్రహంగా ఉంది. కాంగ్రెస్ తమకు నమ్మకద్రోహం చేసిందని ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. లోక్‌సభలో కాంగ్రెస్ వారితో కూర్చోబోమని తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య గ్యాప్ ఉంది. కాంగ్రెస్ అధ్యక్షత వహిస్తున్న ఇండియా కూటమి సమావేశాన్ని డీఎంకే బాయ్‌కాట్ చేసింది.
ఇదిలా ఉంటే, ఉద్ధవ్ సేన పరిస్థితి కూడా అంత బాగా లేదు. డీఎంకేలా తాము కూటమి సమావేశాన్ని బాయ్‌కాట్ చేస్తున్నట్లు చెప్పలేదు. కానీ, నేరుగా సమావేశానికి హాజరయ్యే అవకాశాలు మాత్రం తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. వర్చువల్‌గా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది.
